తెలంగాణ

Telangana: సీఎం రేవంత్‌ చుట్టూ రాజకీయ వ్యూహం.. బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ ఏంటి?..

రచన: Venu•••9 నిమిషాల పఠనం

ఒకవైపు బీఆర్ఎస్‌ తిరిగి బలం పెంచుకునే ప్రయత్నం.. మరోవైపు బీజేపీ ఎదుగుదల.. ఇంకోవైపు కాంగ్రెస్‌లోనే అంతర్గత విభేదాలు.. వీటన్నింటినీ ఎదుర్కొంటూ ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత మరింత పెరుగుతుంది..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి గండం ఏర్పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులను చూస్తున్న వారు.. అసలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం రేవంత్ రెడ్డి అన్న విషయం అందరూ ఒప్పుకోవలసిందే.. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత ఇక తెలంగాణ బీఆర్ఎస్ దొరల సొంతం అని భావించి.. తమకు ఎదురులేదని కేటీఆర్, కేసీఆర్, కవిత మురిసిపోయిన విషయం అందరికీ తెలిసిందే..

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, టీడీపీ పార్టీని నిర్వీర్యం చేసి.. ఆ పార్టీ నేతలను తమలో కలిపేసుకుని పోటీ లేకుండా చేసింది. అప్పటి నుండి అధికారం కోసం అలమటిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ ఇచ్చింది మేమే అనే సానుభూతితో ఓట్లు రాబట్టుకోవాలని చూసుంది కానీ కేసీఆర్ వ్యూహాలముందు చేయి గుర్తు పప్పులు ఉడకలేదు.. అప్పటికే రేవంత్ రెడ్డి కేసీఆర్ ధోరణితో విసిగిపోయి ఉన్నాడు.

ఆసమయంలో తన రాజకీయ వ్యూహాలకు పదునుబెట్టి.. చేయి గుర్తుకు ఆక్సిజన్ అందించి రాష్ట్రంలో బ్రతికించారు. కానీ రేవంత్ సీఎం అవుతాడానే విషయాన్ని చివరి వరకు అత్యంత రహస్యంగా దాచారు. ఒకవేళ ముందే ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తే జరిగే పరిణామాలను పసిగట్టిన అధిష్టానం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. కానీ అప్పటికి రేవంత్ రెడ్డి సీఎం అవడం కాంగ్రెస్ లోని సీనియర్ నేతలకు ఇష్టం లేదని తెలిసేలా కొన్ని కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఏది ఏమైన అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం ఎవరు చేయలేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం పై మొన్నటివరకు జోష్యం చెబుతూనే ఉంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఊహించిన విషయం ఆలస్యంగా అయినా అమలవుతున్నందుకు లోలోపల సంబరపడిపోతుందనే టాక్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ మీద స్వంత పార్టీ నేతలే కుట్రలు పన్నుతున్నా.. వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించలేక.. కాంగ్రెస్ హైకమాండ్‌ మౌనం వహించడం చర్చాంశనీయంగా మారింది.

మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రెండేళ్ల ఎనిమిది నెలలు పూర్తవుతున్నాయి. కాంగ్రెస్‌ రాజకీయ సంస్కృతిని చూస్తే ఇది చిన్న కాలం కాదు. కానీ ఇంతకాలం తర్వాత ఆయన ప్రభుత్వంపై ఒక్కసారిగా రాజకీయ ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది? అసలు ఈ ఒత్తిడి వెనుక ఎవరున్నారు? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.

ఇక అధికారం కోల్పోయిన కేసీఆర్‌ రాజకీయంగా సైలెంట్‌గా కనిపించినా.. బీఆర్ఎస్‌ పూర్తిగా చేతులెత్తేసిందని మాత్రం చెప్పలేం. కాంగ్రెస్‌ బలహీనపడితేనే బీఆర్ఎస్‌కు పునరాగమనానికి అవకాశం ఉంటుందనే రాజకీయ లెక్క ఉంది. అందుకే రేవంత్ ప్రభుత్వంపై వచ్చే ప్రతి వ్యతిరేకతను రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నం సహజంగానే ఉంటుంది.

ఇక్కడే బీజేపీ అంశం కూడా కీలకంగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదగాలంటే.. ముందుగా రేవంత్‌ ప్రభుత్వాన్ని రాజకీయంగా డిఫెన్స్‌లోకి నెట్టాలి. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పెరిగితే.. దాని ప్రత్యక్ష ప్రయోజనం బీజేపీకే దక్కుతుంది. అందుకే కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలు.. బీజేపీ వ్యూహాలు.. బీఆర్ఎస్‌ పునరాగమన ప్రయత్నాలు.. ఒకదానికొకటి కలిసిపోతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇక కాంగ్రెస్‌లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఏర్పడటం మాత్రం పార్టీకి హెచ్చరికే అని చెప్పవచ్చు.. కొండా సురేఖ వివాదం ఇందుకు తాజా ఉదాహరణ. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్‌ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడం.. పార్టీలో విభేదాలు ఏ స్థాయికి వెళ్లాయో తెలుస్తుంది.

మరోవైపు కోమటిరెడ్డి కుటుంబ రాజకీయాలపై కూడా అప్పుడప్పుడూ చర్చ జరుగుతుంది. అంటే రేవంత్‌కు సమస్య కేవలం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాదు.. కాంగ్రెస్‌ ఇంటి లోపల కూడా ఉంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏం చేస్తోంది? అనే ప్రశ్న పుట్టడం సహజమే.. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి రేవంత్‌ రెడ్డి నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే నాయకత్వం బలహీనపడితే.. దాని ప్రభావం కేవలం రేవంత్‌పై మాత్రమే కాదు.. మొత్తం కాంగ్రెస్‌ పార్టీపై పడుతుంది.

కానీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎప్పుడూ రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా స్వేచ్ఛగా వదిలిపెట్టదు. అధికారాన్ని కేంద్రీకరించడం, రాష్ట్ర నాయకుల మధ్య సమతుల్యత కొనసాగించడం కాంగ్రెస్‌ రాజకీయ శైలిలో భాగం. కాబట్టి ప్రతి హైకమాండ్‌ నిర్ణయాన్ని రేవంత్‌కు వ్యతిరేక కుట్రగా చూడటం కూడా సరైంది కాదు.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రేవంత్ రెడ్డి రాజకీయ యుద్ధం చేయక తప్పదు..

ఒకవైపు బీఆర్ఎస్‌ తిరిగి బలం పెంచుకునే ప్రయత్నం.. మరోవైపు బీజేపీ ఎదుగుదల.. ఇంకోవైపు కాంగ్రెస్‌లోనే అంతర్గత విభేదాలు.. వీటన్నింటినీ ఎదుర్కొంటూ ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత మరింత పెరుగుతుంది.. అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రాజకీయ శైలి చూస్తే.. ఒత్తిడికి వెనక్కి తగ్గడం కంటే ఎదురుదాడి చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతారు. అందుకే ఆయనను తక్కువగా అంచనా వేయడం పొరపాటు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

రాబోయే రోజుల్లో ఆయన పార్టీని మరింత కట్టుదిట్టం చేసి.. అసంతృప్త నేతలపై చర్యలు తీసుకుంటూనే ప్రతిపక్షాలపై దూకుడు పెంచుతూ.. హైకమాండ్‌తో కొత్త రాజకీయ ఆట మొదలు పెట్టిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం రేవంత్ రెడ్డి వర్సెస్ ప్రతిపక్షాలు అనే పోరాటం కాదు.

ఇది కాంగ్రెస్‌ అధికారాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటుంది? బీఆర్ఎస్‌ తిరిగి పుంజుకుంటుందా? బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా? కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి ఏ దిశగా వెళ్తుంది? అనే నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పే రాజకీయ యుద్ధం.. రాబోయే కొన్ని నెలల్లో తెలంగాణ రాజకీయాలే వీటికి సమాధానం చెప్పబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు!..

#telangana#Political#CM Revanth reddy#BRS#BJP#kcr#ktr
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి