రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి డ్రైవర్ల నిరవధిక బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు.. అలాగే బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో కదలిరావాలని కూడా కార్మిక సంఘాలు పిలుపును ఇచ్చాయి.
ముఖ్యంగా ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని.. అలాగే ప్రైవేటు రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నిరుద్యోగం పెరుగుతుందని ఆరోపించారు.
ఇప్పటికే వేలాది మంది ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల జీవనోపాధి ఆగమ్యగోచరంగా మారిందని.. ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, రుణ భారం వంటి సమస్యలతో సతమతమవుతున్న డ్రైవర్లకు కొత్త రవాణా విధానాలు మరింత ఒత్తిడిని పెంచుతాయన్న వారు ఆరోపణలు చేశారు.
ఆటోడ్రైవర్లకు ఏటా ఇస్తామన్న రూ.12 వేల ఆర్థికసాయం, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్త పర్మిట్లు వంటి హామీలు నెలవేర్చాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలోనూ అమలు చేయాలని కోరారు. అంతే కాకుండా.. ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమాల్ని అరికట్టాలని డిమాండ్ చేశారు..ఈ నేపథ్యంలో ఆటోవాలాల నిరసనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు..
ఆటో కార్మికుల కోసం వెల్ ఫెర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2015 తర్వాత ఆటోచార్జీలు పెంచలేదని గుర్తు చేసిన మంత్రి.. పెరిగిన ఖర్చుల్ని పరిగణలోకి తీసుకుని కమిటీ వేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఆటోకార్మికుల ప్రతినిధులు,రవాణా అధికారుల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. మరోవైపు పాత ఆటోల్ని స్ప్రాప్ చేసి ఈవీ ఆటోల కొనుగోలులో ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించడంతో ఆటో సంఘాల డిమాండ్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. దీంతో సమ్మెను విరమించేందుకు ఆటో సంఘాలు నిర్ణయించినట్టు సమాచారం. సమ్మె విరమణతో నగర ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. రోజువారీ రాకపోకలపై ఆందోళనలో ఉన్న ప్రజలకు ఇది ఊపిరిపీల్చుకునే వార్తగా మారింది. మొత్తంగా.. ఆటో సమ్మెకు బ్రేక్ పడే సూచనలు కనిపించడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


