వర్షాలు కురవడం లేదని తెలంగాణలోని ఓ గ్రామంలోని ప్రజలు వింత చర్యకు పూనుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా వారు చేసిన పని ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.ఇలా కూడా ఉన్నారా? జనాలు అని చర్చ జరుగుతోంది.వర్షాలు రాకపోతే పూజలు చేయడం చూసి ఉంటారు. కప్పు తల్లి ఆటలు,గాడిదలకు పెళ్లి చేయడం వంటివి నేటికీ కొన్ని గ్రామాల్లో ప్రజలు పాటిస్తుంటారు. కానీ, పై వాటికి భిన్నంగా ఈ ఘటన ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
వివరాల్లోకివెళితే.. వర్షాలు పడడం లేదని పూడ్చిన శవాన్ని బయటకు తీసి తిరిగి దహనం చేశారు గ్రామపెద్దలు.ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామంలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందాడు.
దీంతో అతని మృతదేహాన్ని తన సొంత గ్రామమైన కోడోనిపల్లిలో కుటుంబసభ్యులు సమాధిచేశారు. అయితే, వర్షాలు కురవకపోవడానికి దీనికి సంబంధం ఉందంటూ ఆ ఊరి గ్రామపెద్దలు ఆ మృతదేహాన్ని దహనం చేయాలని నిర్ణయించారు. దీంతో సమాధిని తవ్వి మరల శవాన్ని బయటకు తీసి కట్టెలపై ఉంచి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ పాకింది.
దీంతో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.సమాజాన్ని మూఢనమ్మకాల వైపు వెళ్లనివ్వకుండా గ్రామస్తులు, గ్రామపెద్దలకు అవగాహన కల్పించాలని, మరల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని, ప్రజలను జ్ఞానం వైపు నడిపించాలని, మూఢనమ్మకాల వైపు కాదని పలువురు కోరుతున్నారు.కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం.


