దేశవ్యాప్తంగా ఉల్లిధరలు కొండెక్కాయి. వర్షాకాలం కావడంతో ఉల్లి దిగుబడి బాగా పడిపోయింది. ప్రతి ఏటా తెలంగాణకు మహారాష్ట్ర నుంచే అధికంగా ఉల్లి దిగుమతి అవుతుంటుంది.ఈసారి ఆశించిన స్థాయిలో ఉల్లి దిగుబడి రాలేదని తెలుస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో రైతులు కూడా ఉల్లిని ఎక్కువగా సాగు చేయరు.వర్షాలకు ఉల్లినారు పాడవడం, విత్తనాలు కొట్టుకుపోవడం వంటివి జరుగుతాయని అన్నదాతలు చెబుతున్నారు.
ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాఖ తెలిపినా రైతులు మాత్రం ఉల్లి సాగుకు ధైర్యం చేయలేదని తెలుస్తోంది..దీంతో ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయాయి. మార్కెట్లో ఉల్లి ధర కొండెక్కి కూర్చున్నది.ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి కిలోకు రూ.50 నుంచి 70 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మొన్నటివరకు హైదరాబాద్‌లో రూ.100కు 3 నుంచి 4 కేజీలు అమ్మారు. కానీ, ఇప్పుడు అదే నాలుగు కేజీలకు 150 నుంచి 160 వరకు అమ్ముతున్నట్టు సమాచారం.
మలక్ పేట వ్యవసాయ మార్కెట్లో ఇదివరకు క్వింటా హోల్ సేల్ ధర రేటు రూ.2500 నుంచి 3వేలు ఉండగా.. ప్రస్తుతం ఏది ఏకంగా రూ.4500 నుంచి 5వేలకు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, మార్కెట్లో ధరలు చూసి ఉల్లి వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఏమీ కొనేటట్టు లేదని వాపోతున్నారు. ఒకప్పుడు రెండు నుంచి మూడు కిలోలు కొనుగులు చేసిన వారు ప్రస్తుతం కేజీ నుంచి ఆఫ్ కేజీ వరకు కొనుగోలు చేసి పొదుపుగా వాడుతున్నట్టు తెలుస్తోంది.
ఉల్లి ధరలు కొండెక్కిన వేళ కేంద్రం వినియోగదారులకు శుభవార్త చెప్పింది.బఫర్ స్టాక్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, చెన్నయ్, కొచ్చి, గుహవాటి తదితర ప్రాంతాలకు నాసిక్ (మహారాష్ట్ర) నుంచి కందా ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో తక్కువ ధరలకు ఉల్లిని అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఢిల్లీ,ముంబై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఉల్లి కిలోకు రూ.50 నుంచి 70 పలుకుతోంది.


