అందాల పోటీల వేదికపై భారతదేశం తరఫున మరో యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక జాతీయ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది విజేత మణికా విశ్వకర్మ ఆమెకు కిరీటం తొడిగి అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు.
ఇక ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ రెండో స్థానంలో నిలవగా, గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతావలేకర్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కఠినమైన ఆడిషన్లు, ఇంటర్వ్యూలు, ప్రాథమిక రౌండ్లను దాటుకుని తుది దశకు చేరుకున్న 52మంది అత్యుత్తమ ఫైనలిస్టులతో కజియా తీవ్రంగా పోటీపడ్డారు. అన్ని విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకుంటూ జ్యూరీని ఆకట్టుకుని చివరికి విజేతగా నిలిచారు.
ఈ వేడుకకు 1994లో భారత్‌కు మొట్టమొదటిసారిగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన ప్రముఖ నటి సుష్మితా సేన్ చీఫ్ జ్యూరీగా వ్యవహరించడం విశేషం. కజియాతో పాటు సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా తదితర మాజీ అందాల రాణులు జ్యూరీ ప్యానెల్‌లో సభ్యులుగా ఉండి విజేతలను ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో కిరీటాన్ని కైవసం చేసుకున్న కజియా లిజ్ మెజోకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశం లభించింది.
రాబోయే నవంబర్ నెలలో ప్యూర్టో రికో వేదికగా జరగనున్న అంతర్జాతీయ ప్రతిష్టాత్మక '75వ మిస్ యూనివర్స్' పోటీల్లో ఆమె భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. 19 ఏళ్ల వయసులోనే లా విద్యార్థిగా రాణిస్తూ, అటు మోడలింగ్‌లోనూ సత్తా చాటుతున్న కజియా.. ఈ గ్లోబల్ వేదికపై మన దేశం తరఫున కిరీటాన్ని సాధించిపెట్టాలని కోరుకుంటూ అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


