తెలంగాణ

Telangana : ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా.. పీఎం విద్యాలక్ష్మి ప‌థ‌కం!..

రచన: Venu10 నిమిషాల పఠనం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,425 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలు పీఎం విద్యాలక్ష్మి పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఇందులో చోటు పొందాయి. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించే జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ వ్యవస్థ(ఎన్ఐఆర్ఎఫ్‌) ఆధారంగా అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేస్తున్నారు.

- ఒకే పోర్ట‌ల్‌తో సులువుగా విద్యా రుణాల మంజూరు

- పూచీక‌త్తు లేకుండా ఉన్న‌త చ‌దువుల‌కు రుణాలు

- రుణాల‌కు ప్ర‌భుత్వ హామీ.. వ‌డ్డీపై రాయితీ

ప్ర‌తిభావంతులైన విద్యార్థుల ఉన్న‌త చ‌దువుల‌కు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. అగ్రశ్రేణి ఉన్నత విద్యా సంస్థల్లో సొంత ప్రతిభతో ప్రవేశం పొందిన విద్యార్థులకు పూచీకత్తు, హామీదారు అవసరం లేకుండా విద్యా రుణాలు అందించటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కుటుంబ వార్షిక ఆదాయం ఆధారంగా వడ్డీ రాయితీ సైతం కల్పిస్తోంది. విద్యా రుణాల‌ దరఖాస్తు నుంచి రుణల మంజూరు వరకు పూర్తి ప్రక్రియను డిజిటల్ విధానంలో చేపడుడుతోంది. ఆర్థిక వనరుల కొరత కారణంగా ఏ విద్యార్థీ ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కేంద్రం ఈ ప‌థ‌కాన్ని రూపొందించింది.

పెరుగుతున్న ఉన్నత విద్య ప్రవేశాలు

దేశంలో గత పదేళ్ల కాలంలో ఉన్నత విద్య ప్రవేశాలు వేగంగా పెరిగాయి. స్థూల ప్రవేశాల నిష్పత్తి 2014-15లో 23.7 శాతం ఉండగా, 2023-24 నాటికి 30 శాతానికి చేరింది. అయితే, ఐఐటీలు, ఐఐఎంలు సహా అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో చదవాలన్న కల ఎంతోమంది ప్రతిభావంతులకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నెరవేరటం లేదు. విద్యా రుణాలు అందుబాటులో ఉన్నా, అధిక వడ్డీ రేట్లను భరించలేక పలువురు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం 2024 నవంబర్ 6న పీఎం విద్యాలక్ష్మి పథకానికి ఆమోదం తెలిపింది.

1,425 విద్యా సంస్థలకు వర్తింపు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,425 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలు పీఎం విద్యాలక్ష్మి పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఇందులో చోటు పొందాయి. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించే జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ వ్యవస్థ(ఎన్ఐఆర్ఎఫ్‌) ఆధారంగా అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేస్తున్నారు. ఎన్ఐఆర్ఎఫ్ సమగ్ర, విభాగాలవారీ లేదా రంగాలవారీ ర్యాంకుల్లో తొలి 100 స్థానాల్లో నిలిచిన విద్యా సంస్థలు, రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలో తొలి 200 స్థానాల్లో ఉన్న సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిగతా ఉన్నత విద్యా సంస్థలు పథకం పరిధిలోకి వస్తాయి. మేనేజ్‌మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ద్వారా ప్రవేశం పొందిన వారికి ఈ ప్రయోజనం వర్తించదు.

పూచీకత్తు లేకుండానే విద్యా రుణం

పథకం కింద విద్యా రుణం పొందేందుకు విద్యార్థులు ఆస్తులను పూచీకత్తుగా చూపాల్సిన అవసరం లేదు. మూడో వ్యక్తి హామీ సైతం అక్కర్లేదు. రుణ గరిష్ఠ మొత్తంపై నిర్దిష్ట పరిమితి విధించలేదు. కోర్సు ఫీజు, హాస్టల్, మెస్ రుసుములు, ల్యాప్‌టాప్ కొనుగోలు వ్యయం, కోర్సు కాలంలో అవసరమయ్యే జీవన ఖర్చులను పరిగణనలోకి తీసుకుని రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు. భారత్‌లోని అన్ని డిగ్రీ, డిప్లొమా కోర్సులకు రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అన్ని ఆదాయ వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

రూ.7.5 లక్షల రుణంపై 75 శాతం హామీ

బ్యాంకులు ఎక్కువమంది విద్యార్థులకు రుణాలు అందించేలా ప్రోత్సహించేందుకు రూ.7.5 లక్షల వరకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం 75 శాతం రుణ హామీ కల్పిస్తోంది. దీనివల్ల విద్యార్థులకు రుణ లభ్యత మెరుగుపడుతుంది. పథకంలో భాగస్వాములైన షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా రుణాలు అందుతాయి. కోర్సు కాలంతో పాటు మరో ఏడాది మారటోరియం ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత రుణ చెల్లింపునకు 15 ఏళ్ల వరకు సమయం లభిస్తుంది.

ఆదాయం ఆధారంగా వడ్డీ రాయితీ

వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న ప్రతిభావంతులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణంపై మారటోరియం కాలంలో 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. రుణ మొత్తం రూ.10 లక్షలు దాటితే, మంజూరైన‌ అసలు రుణంలో రూ.10 లక్షల వరకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఏడాదికి గరిష్ఠంగా లక్ష మంది కొత్త విద్యార్థులు ఈ ప్రయోజనం పొందవచ్చు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల వరకు ఉండి, గుర్తింపు పొందిన సంస్థల్లో సాంకేతిక లేదా వృత్తి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పీఎం-యూఎస్‌పీ సీఎస్ఐఎస్ కింద మారటోరియం కాలమంతా పూర్తి వడ్డీ రాయితీ అందుతుంది.

వడ్డీ రేటుపై గరిష్ఠ పరిమితి

పీఎం విద్యాలక్ష్మి కింద తీసుకునే విద్యా రుణంపై వడ్డీ రేటు సంబంధిత బ్యాంకు బాహ్య ప్రామాణిక ఆధారిత రుణ రేటు(ఈబీఎల్ఆర్) కంటే 0.5 శాతం మేర మాత్రమే అధికంగా ఉండేందుకు పరిమితి విధించారు. పథకం పరిధిలోకి రాని ఇతర విద్యా రుణాలతో పోలిస్తే ఈ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. చదువుకునే కాలం, మారటోరియం వ్యవధిలో వడ్డీని చెల్లిస్తే బ్యాంకులు అదనంగా ఒక శాతం వరకు రాయితీ ఇవ్వవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈ కింద చెల్లించిన వడ్డీపై పన్ను ప్రయోజనం సైతం పొందవచ్చు.

ఒకే పోర్టల్‌లో పూర్తి ప్రక్రియ

విద్యా రుణ దరఖాస్తు ప్రక్రియను సరళంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక పీఎం విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తమకు అనువైన బ్యాంకును ఎంపిక చేసుకోవటం, దరఖాస్తు స్థితిని తెలుసుకోవటం, వడ్డీ రాయితీ కోరటం, ఫిర్యాదులు సమర్పించటం వంటి సేవలు ఒకేచోట లభిస్తాయి. రుణానికి ఆమోదం లభించి, మంజూరైన‌ తర్వాత వడ్డీ రాయితీని పీఎం విద్యాలక్ష్మి డిజిటల్ రూపీ యాప్‌లోని సీబీడీసీ వాలెట్‌కు జమ చేస్తారు. అక్కడి నుంచి ఆ మొత్తాన్ని విద్యా రుణ ఖాతాకు బదిలీ చేస్తారు.

ఏడేళ్ల‌లో ఏడు ల‌క్ష‌ల మంది ప్ర‌యోజ‌నం

2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్ని విద్యా పథకాల కింద పీఎం విద్యాలక్ష్మి పోర్టల్‌కు 6,45,514 విద్యా రుణ దరఖాస్తులు అందాయి. వీటిలో 1,10,667 దరఖాస్తులు పీఎం విద్యాలక్ష్మి రుణాలకు సంబంధించినవి. మొత్తం 70,852 రుణాలకు ఆమోదం లభించగా, 67,728 రుణాలను ఇప్పటికే పంపిణీ చేశారు. పీఎం విద్యాలక్ష్మి పథకం అమలుకు 2024-25 నుంచి 2030-31 వరకు కేంద్ర ప్రభుత్వం రూ.3,600 కోట్లు కేటాయించింది.

ఈ ఏడేళ్ల కాలంలో కొత్తగా 7 లక్షల మంది విద్యార్థులకు వడ్డీ రాయితీ ప్రయోజనం అందుతుందని అంచనా. ఆర్థికంగా బలహీన వర్గాలు, ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు సహా అన్ని సామాజిక వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. నాణ్యమైన విద్యకు సమాన అవకాశాలు కల్పిస్తూ, నైపుణ్యవంతమైన మానవ వనరుల నిర్మాణానికి పీఎం విద్యాలక్ష్మి బలమైన ఆర్థిక భరోసాగా నిలుస్తోంది.

#Telangana#Financial support#higher education#PM Vidya Lakshmi#Scheme
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి