AP SIR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని రిలీజ్ చేసింది. జులై 24 నాటికి 4 కోట్ల 16 లక్షల 27వేల 694 మంది ఓటర్లలో 3 కోట్ల 71 లక్షల 38 వేల 182 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 89.22% ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించారు. 44 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లుగా గుర్తించారు. వీరిలో చనిపోయిన వారు, చిరునామా మార్చుకున్న వారు, శాశ్వతంగా షిఫ్ట్ అయిన వారు, డబుల్ ఎన్ రోల్ మెంట్ (డూప్లికేట్- రెండు చోట్ల ఓటు ఉన్న వారు) ఓటర్లు ఉన్నారు. ఇక, 15 లక్షల 22 వేల మందిని మృతులుగా గుర్తించారు.
ఇక 22 లక్షల 30 వేల మంది శాశ్వతంగా ఇల్లు మారడం లేదా ఫామ్స్ సబ్మిట్ చేయకపోవడం గుర్తించారు. 7 లక్షల 37 వేల మంది డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించారు. వీరంతా ఒకటి కంటే ఎక్కువ చోట్ల తమ పేరును ఎన్‌రోల్ చేసుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ్టి (జూలై 31) నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఇక, నిజమైన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఫారం-6 ద్వారా మళ్లీ నమోదు చేసుకునే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.
''4.16 కోట్ల ఓటర్లలో 89.22 శాతం మంది ఫారాలు ఇచ్చారు. 15.22 లక్షల మందిని మృతులుగా గుర్తించారు. 22.30 లక్షల మంది శాశ్వతంగా మారారు లేదా గైర్హాజరయ్యారు. 7.37 లక్షల మంది పేర్లు రెండు, మూడు చోట్ల నమోదయ్యాయి'' అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సర్ ముసాయిదా ఓటర్ లిస్ట్ ను రిలీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును కూడా తొలగించబోముని తేల్చి చెప్పారు. ఇక, ఆగస్టు 4న అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ కానుంది. ఆయా రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటరు జాబితా సాఫ్ట్ కాపీ ఇవ్వనుంది.
ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జూన్ 14 నుంచి మొదలైంది. జూలై 14 వరకు సాగింది. తర్వాత మళ్లీ 10 రోజులు గడువు పొడిగించారు. జూలై 24ను కటాఫ్ డేట్ గా ప్రకటించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. ఏపీలో 4 కోట్ల 70 లక్షల మందికిపైగా ఉన్న ఓటర్లలో 89శాతం ఎన్యుమరేషన్ పూర్తైంది.












