ప్రపంచంలో ఏ ఉద్యమం మొదలైన త్వరగా వైరల్ అవుతుంది అంటే కారణం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ.. అయితే ఇందులో ఒకే ఫార్ములాను నాటి నుండి నేటి వరకు ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా విద్యార్థులు రోడ్లపైకి వస్తారు... తర్వాత సోషల్ మీడియాలో ఉద్యమం వైరల్ అవుతుంది... కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది నిరసనల్లో పాల్గొంటారు.. చివరికి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
మరి ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. మనం సెర్బియా లో జరిగిన విషయాలు తెలుసుకోవాలసిందే..సెర్బియాలో అప్పటి అధ్యక్షుడు స్లోబోదాన్ మిలోసెవిచ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1998లో ఓట్పోర్ అనే విద్యార్థి ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారు తుపాకులు పట్టలేదు.. హింసకు దిగలేదు.. కానీ వ్యంగ్యం, మీమ్స్, పోస్టర్లు, వీధి నాటకాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చివరకు 2000లో మిలోసెవిచ్ అధికారం కోల్పోయారు. ఆ తర్వాత ఈ ఉద్యమంలో పాల్గొన్న కొందరు కార్యకర్తలు CANVAS అనే సంస్థను ఏర్పాటు చేసి, అహింసాత్మక ఉద్యమాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ ఉద్యమాల పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.
ఉదాహరణకు ఉక్రెయిన్‌లో జరిగిన ఆరెంజ్ రివల్యూషన్‌ను తీసుకుంటే... ఎన్నికల అవకతవకల ఆరోపణలతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భారీ టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు. నిరసనలు కొనసాగించడంతో ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈజిప్ట్‌లో అరబ్ స్ప్రింగ్ సమయంలో... ఫేస్‌బుక్ ద్వారా వేలాది మంది యువత ఒక్కసారిగా తహ్రీర్ స్క్వేర్‌కు చేరుకున్నారు.
ఈ ఉద్యమానికి సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారింది. చివరకు మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న హోస్నీ ముబారక్ పదవి వీడాల్సి వచ్చింది. అలాగే బంగ్లాదేశ్‌లో కేవలం స్టూడెంట్స్ రిజర్వేషన్ల కోసం మొదలైన గొడవ, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా యాంటీ- డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్ గా మారింది. ప్రభుత్వం ఇంటర్నెట్ ఆపేసినా ఈ జెన్-జీ విద్యార్థులు డిజిటల్ టూల్స్ వాడి దేశాన్ని స్తంభింపజేశారు. చివరికి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయేలా చేశారు.
అలాగే నేపాల్ ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగంపై సోషల్ మీడియా వేదికగా సాగిన డిజిటల్ ఉద్యమం, క్షణాల్లో వీధుల్లోకి చేరి ఉధృత రూపం దాల్చింది. విద్యార్థుల నిరసనలతో కాఠ్మండు అతలాకుతలమైంది. పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోవడంతో, ప్రజా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు రాజకీయ ఉద్యమాలకు ఒకప్పుడు కరపత్రాలు వాడేవారు. గోడలపై పోస్టర్లు వేసేవారు..
కానీ ఇప్పుడు సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుంది. రీల్స్, మీమ్స్, హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. కొన్ని గంటల్లోనే లక్షల మందికి సమాచారం చేరుతోంది. దీనినే కొందరు డిజిటల్ మొబిలైజేషన్ అంటున్నారు. ఇక భారతదేశంలో కూడా సోషల్ మీడియా ఆధారంగా అనేక ఉద్యమాలు జరిగాయి. అయితే భారతదేశ రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య సంస్థలు, ఎన్నికల ప్రక్రియ ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి.
అందుకే సెర్బియా, ఉక్రెయిన్.. చివరికి బంగ్లాదేశ్‌తరహా పరిణామాలు.. భారత్‌లో మాత్రం రిపీట్ కాలేదు!.. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, వ్యంగ్య వీడియోల ద్వారా యువతలో అసంతృప్తిని పెంచి.. దాన్ని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా మార్చాలని కొందరు స్కెచ్ వేశారు. సెర్బియాలోని 'ఓట్పోర్' ఉద్యమం తరహాలోనే డిజిటల్ ప్రచారంతో ప్రభుత్వంపై దాడికి దిగారు. కానీ.. వారి ప్లాన్లన్నీ పూర్తిగా బెడిసికొట్టాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు!
అయితే... భారత్‌లో పరిస్థితి మరో మలుపు తిరిగిందని విశ్లేషకుల వాదన. ఉద్యమం మరింత ఉధృతం కావచ్చని భావించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థుల డిమాండ్లపై స్పందించడం, అలాగే చట్టపరమైన, పరిపాలనా చర్యలను వేగవంతం చేయడం వల్ల ఉద్యమం ఊపు తగ్గిందని వారు విశ్లేషిస్తున్నారు.
ఈ కారణాల వల్ల.. సోషల్ మీడియాలో కనిపించిన ఆవేశం, దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్యమంగా మారలేకపోయిందని.. భారత రాజకీయ వ్యవస్థలో వేగంగా మారే వ్యూహాలు, బలమైన ప్రజాస్వామ్య సంస్థలు, ఎన్నికల రాజకీయాలే దీనికి ప్రధాన కారణాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.












