సమాజంలో విలువలు క్రమంగా అంతరించిపోతున్నాయి. స్నేహితుడినే గంజాయి కేసులో ఇరికించాలని ఓ కానిస్టేబుల్ చేసిన కుట్ర భగ్నమైంది.చివరకు అసలు విషయం తెలియడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా.. శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. పోలీసు జాబ్‌ను అడ్డుపెట్టుకుని ఓ కానిస్టేబుల్.. తన స్నేహితుడిని అక్రమంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించాడు. సదరు వ్యక్తిని కరీంనగర్ ఈగల్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగరాజుగా గుర్తించారు పోలీసులు. దీంతో శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తన ఫ్రెండ్ ఇంట్లో స్వయంగా గంజాయిని తెచ్చి పెట్టి అతడిని పోలీసులకు పట్టించాలని చూసినట్టు విచారణలో తేలింది. దీంతో కానిస్టేబుల్ నాగరాజును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే కానిస్టేబుల్ నాగరాజు.. తన ఫ్రెండ్ ఇంట్లో రహస్యంగా గంజాయి ప్యాకెట్లను ఉంచాడు.
ఆ తర్వాత తన సహచర సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఈగల్ బృందాలు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి సోదాలు జరిపాయి. గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అరెస్టు చేశాయి. విచారణ జరిగే క్రమంలో బాధితుడి ప్రవర్తన, లభ్యమైన ఆధారాలపై అనుమానం రావడంతో పోలీసులు మరింత లోతుగా విచారించారు.
స్థానిక సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించగా.. కానిస్టేబుల్ నాగరాజే గంజాయిని బయట నుంచి తెచ్చి తన ఫ్రెండ్ ఇంట్లో పెట్టినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ విషయం కాస్త డీజీపీ సీవీ ఆనంద్ వద్దకు వెళ్లడంతో.. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారే ఇలాంటి చట్టవ్యతిరేక చర్యకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే అతన్ని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.












