వలసవాదం ఇప్పుడు అన్ని దేశాలకు తీవ్ర తలపోటుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మైగ్రేషన్స్ జరుగుతున్నాయి. ఉపాధి, ఆహారం, రక్షణ కోసం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దేశాల సరిహద్దులు దాటుతున్నారు. చొరబాట్లు ఎక్కువ అవుతుండటంతో కొన్ని దేశాలు తమ సరిహద్దులు మూసేస్తున్నాయి.ఇక చొరబాటు దారులు వచ్చి తమ దేశ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని, నేరాలు పెరుగుతున్నాయని, ఉపాధికి కొల్లగొడుతున్నారని మరొకొన్ని దేశాలు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.
తాజాగా ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని స్పెయిన్‌లో ఇదే వివాదం నడుస్తోంది. స్పెయిన్ దేశంలోని సెయుటా నగరం వైపునకు మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. సరిహద్దు కంచెలను తెంచుకుని, సముద్రంలో ఈతకొడుతూ పెద్ద సంఖ్యలో చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నీటమునిగి కనీసం 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటిపోవడం, శరణార్థి శిబిరాలు నిండిపోవడంతో స్పెయిన్ గవర్నమెంట్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల వద్ద శాంతిభద్రతలను పునరుద్ధరణ, అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించింది.
చొరబడిన అక్రమ వలసదారులను తిరిగి మొరాకోకు పంపించేయాలని స్పెయిన్ నిర్ణయించడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. డిపోర్టేషన్‌ను వ్యతిరేకిస్తూ పలువురు అల్లర్లకు తెరలేపారు. స్థానిక పౌరులు, వలసదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలువురు ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.












