Ramayana: గ్లామర్ ప్రపంచంలో మెరిసే తారలకు ఉండే క్రేజ్ వేరు. నిమిషానికో రంగు మార్చే ఫ్యాషన్ ట్రెండ్స్, సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోషూట్లతో ట్రెండింగ్‌లో ఉండే నూతన తరం భామల మధ్య.. ఎటువంటి మేకప్ లేకుండా, ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా తన సహజమైన నటనతోనే కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది సాయిపల్లవి. అయితే, ఇప్పుడు ఆమె కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రామాయణ' చిత్రంలో సీతాదేవిగా నటిస్తుండటంతో కొందరికి నిద్ర కరువైంది. తాజాగా విడుదలైన నాలుగు నిమిషాల ట్రైలర్ చూశాక, సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్ చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
సినిమా రంగంలో గ్లామరే పరమావధిగా బతికే కొన్ని ముంబై వర్గాలకు, ట్రెడిషనల్ రోల్స్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్న సాయిపల్లవి ఎజెండా అస్సలు మింగుడు పడటం లేదు. వాణిజ్య చిత్రాల్లో బికినీలు ధరించి, గ్లామర్ ఒలకబోసే భామలను మాత్రమే హీరోయిన్లుగా చూడటానికి అలవాటు పడిన వారికి.. పద్ధతిగా, అచ్చమైన తెలుగు ఇళ్లలోని ఆడపడుచులా కనిపించే సాయిపల్లవి సీతగా ఎంపిక కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే కావాలనే ఆమె లుక్స్‌పై పెడర్థాలు తీస్తూ, పక్కన ఉన్న చెలికత్తెలతో పోలుస్తూ చీప్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
నిజానికి, రామాయణం లాంటి పౌరాణిక కావ్యంలో సీత పాత్రకు కేవలం అందం మాత్రమే సరిపోదు. ఆ పాత్రకుండు పవిత్రత, అభినయం, ఆత్మవిశ్వాసం ఉట్టిపడే హావభావాలు చాలా ముఖ్యం. అంజలి దేవి నుంచి దీపికా చికిలాల వరకు చరిత్రలో నిలిచిపోయిన ప్రతి సీత పాత్ర వెనుక కేవలం రూపం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ చిత్ర దర్శకుడు నితేశ్ తివారి కూడా ఎన్నో ఆడిషన్లు, సుదీర్ఘ కసరత్తుల తర్వాతే సాయిపల్లవిని ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఒకవేళ 'వార్ 2' లోనో లేక 'పఠాన్' లాంటి చిత్రాల్లోనో అందాలు ఆరబోసిన గ్లామర్ డాల్స్‌ను ఈ పాత్రలో పెట్టి ఉంటే, ఈ పాటికి బాలీవుడ్ మీడియా మోత మోగిపోయేది. కానీ, ఏమాత్రం గ్లామర్ జోలికి వెళ్లకుండా, కేవలం నటనను నమ్ముకుని ఉన్న సాయిపల్లవిని చూసి ఓర్వలేకపోవడమే ఈ విమర్శల వెనుక ఉన్న అసలు కడుపుమంట.
సినిమా రిలీజ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉండగానే, లేనిపోని పోలికలతో ఈ రభస సృష్టిస్తున్నారంటే వీళ్ల అసలు ఉద్దేశం సినిమాపై నెగెటివిటీ పెంచడమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటన్నింటికీ మాటలతో కాదు, రాబోయే దీపావళికి తెరపై రాబోయే రామాయణ సినిమాతోనే సాయిపల్లవి తన నటన ద్వారా గట్టి సమాధానం ఇవ్వడం మాత్రం ఖాయమనే చెప్పాలి.












