ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మొత్తం రూ.4 లక్షల 50 వేల 988 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఆదాయం పెంచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
మరోవైపు పీఎం సూర్య సరోవర్ యోజన పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేబినెట్ నిర్ణయించింది.. అలాగే ఈ పథకం కొనసాగింపు కోసం రూ.5 వేల 70 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం సైతం రూ.3 లక్షల 15 వేల614 కోట్లు కేటాయించడానికీ అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో 2030-31 వరకు పీఎం కిసాన్ స్కీమ్ కొనసాగించనున్నారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2026-27 నుంచి 2030-31 వరకు అర్హులైన రైతులకు ఇప్పటివరకు అందుతున్న ఆర్థిక సాయం యథావిధిగా కొనసాగనుంది. ఇక 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
మరోవైపు దేశంలో క్రీడలను ప్రోత్సహించడం, యువ ప్రతిభను వెలికితీయడం. గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులకు శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించడంతో పాటు, భవిష్యత్ ఒలింపిక్, ఆసియా క్రీడల ఛాంపియన్లను తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశంగా ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీమ్ కోసం రూ.36,441 కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్ర మంథన్ కార్యక్రమానికి రూ.84 వేల 84 కోట్లు.. క్వీన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణం కోసం రూ.9 వేల 779 కోట్లు కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.












