తెలంగాణ

సైబర్ నేరాలే అతిపెద్ద సవాల్.. బాధితులు వెంటనే ఇలా చేయాలి- డీజీపీ సీవీ ఆనంద్

రచన: NK10 నిమిషాల పఠనం

2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20 శాతం తగ్గుదల నమోదైంది. అదే విధంగా సైబర్ ఫిర్యాదులు 91,369కు పరిమితమవడంతో ఫిర్యాదుల్లో కూడా 3 శాతం తగ్గుదల నమోదైంది.

* సైబర్ నేరాలను నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు

* సైబర్ మోసాలతో కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి.. జీవితకాల సంపాదన కోల్పోతున్నారు

* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై డీజీపీ సమగ్ర సమీక్ష

* AI ఆధారిత కాల్ సెంటర్, సైబర్ ల్యాబ్‌లు, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాలను పరిశీలించిన డీజీపీ

* సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించి దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి

తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ ల్యాబ్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (SOC), సెంట్రల్ మానిటరింగ్ యూనిట్, సోషల్ మీడియా యూనిట్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, డిజిటల్ ఫోరెన్సిక్ యూనిట్ తదితర విభాగాలను సందర్శించి వాటి పనితీరు, సాంకేతిక సామర్థ్యాలు, దర్యాప్తు విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని సమీక్షించారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తో పాటు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాల తాజా ధోరణులు, దర్యాప్తు విధానాలు, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం, బాధితులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై డీజీపీకి వివరించారు.

AI ఆధారిత కాల్ సెంటర్ పనితీరుపై డీజీపీ ప్రశంసలు..

సమీక్షలో భాగంగా డీజీపీ స్వయంగా AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. "నేను సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయాను" అని బాధితురాలు చెప్పగానే AI వ్యవస్థ వెంటనే స్పందించి, ఆమెకు ధైర్యం చెబుతూ పేరు, ప్రాంతం, సమీప పోలీస్ స్టేషన్, సంఘటన వివరాలను సేకరించింది. అదే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా సమాచారం చేరే విధానాన్ని డీజీపీ పరిశీలించి అభినందించారు. ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు AI ఆధారిత సేవలను విస్తరించాలని అధికారులకు సూచించారు.

సైబర్ నేరాల నియంత్రణలో ఫలితాలు..

అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20 శాతం తగ్గుదల నమోదైంది. అదే విధంగా సైబర్ ఫిర్యాదులు 91,369కు పరిమితమవడంతో ఫిర్యాదుల్లో కూడా 3 శాతం తగ్గుదల నమోదైంది.

నేరస్తుల ఖాతాల్లోని నిధులను నిలిపివేసే POH మొత్తం రూ.255 కోట్ల నుంచి రూ.279 కోట్లకు పెరగగా, POH శాతం 9 శాతం నుంచి 12 శాతానికి పెరగడం బాధితుల సొమ్ము రక్షణలో తెలంగాణ సాధించిన పురోగతికి నిదర్శనమని అధికారులు వివరించారు.

సైబర్ నేరాల్లో రికవరీలో రికార్డ్..

2025లో దేశవ్యాప్తంగా నమోదైన 49,620 సైబర్ FIRలలో తెలంగాణలోనే 21,639 FIRలు నమోదయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ FIRలలో 44 శాతం తెలంగాణ నుంచే నమోదయ్యాయి. దీంతో సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అలాగే రూ.75 లక్షలకు పైగా నష్టం కలిగిన కేసుల్లో 78 శాతం, రూ.1 లక్షకు పైగా నష్టం ఉన్న కేసుల్లో 56 శాతం FIR కన్వర్షన్ రేటు నమోదు కావడం రాష్ట్ర పోలీసుల సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని అధికారులు వివరించారు.

సైబర్ నేరాల వల్లే అత్యధిక ఆర్థిక నష్టం..

2025లో రాష్ట్రంలో నమోదైన 86,177 ప్రధాన నేరాల FIRలలో 21,639 సైబర్ నేరాలకు సంబంధించినవే. అంటే ప్రతి నాలుగు ప్రధాన నేరాల FIRలలో ఒకటి సైబర్ నేరానిదే. ఇతర ప్రధాన నేరాల వల్ల రూ.207 కోట్ల ఆర్థిక నష్టం జరగగా, సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల నష్టం సంభవించింది. అంటే ఇతర ప్రధాన నేరాల కంటే దాదాపు ఏడు రెట్లు అధిక ఆర్థిక నష్టం సైబర్ నేరాల వల్లే జరుగుతోందని అధికారులు తెలిపారు.

సైబర్ నేరాలే భవిష్యత్‌లో అతిపెద్ద సవాల్- డీజీపీ

తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట సందర్శించిన ప్రత్యేక విభాగాల్లో EAGLE ఒకటని, ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరును పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు డీజీపీ సీవీ ఆనంద్. రాష్ట్ర భద్రతలో ఈ రెండు విభాగాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.

సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కొత్త ఆలోచనలు, కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక సాంకేతికత, డేటా అనలిటిక్స్ వినియోగిస్తూ ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న జాతీయ పనితీరు సూచికల్లో తెలంగాణ మరింత మెరుగైన స్థానం సాధించే అవకాశం ఉందని, అందుకు సాంకేతిక వ్యవస్థలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని అన్నారు.

ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక బలగాల పునర్వ్యవస్థీకరణతో పాటు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక విభాగాల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. అవసరమైతే మానవ వనరులను సమర్థంగా వినియోగించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.

ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లు, డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్న డీజీపీ, ఇప్పుడే వీటిని సమర్థంగా నియంత్రించకపోతే భవిష్యత్‌లో మరింత తీవ్రమైన సమస్యలు, పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

"సైబర్ నేరాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపులను ఒక్క క్షణంలో కోల్పోతున్నారు. భవిష్యత్‌లో నేరాల స్వరూపం ప్రధానంగా సైబర్ నేరాల చుట్టూనే తిరుగుతుంది. అందువల్ల ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించి, సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి" అని డీజీపీ ఆనంద్ సూచించారు.

తెలంగాణను సాంకేతికత ఆధారిత సైబర్ పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, వేగవంతమైన స్పందన, ప్రజల్లో విస్తృత అవగాహన, సమర్థవంతమైన దర్యాప్తు ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో అగ్రస్థానాన్ని నిలబెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రజలు సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్స్ లో వెంటనే ఫిర్యాదు చేయాలని, OTPలు, పాస్‌వర్డ్స్, బ్యాంకు వివరాలు, ఇతర ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో పంచుకోవద్దని తెలంగాణ పోలీసులు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

#Cyber Crime#DGP CV Anand#Telangana#AI#Telangana Police
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి