తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు ఈ పథకాన్ని తమ లాభాల కోసం వాడుకుంటూ పేదల కడుపు కొట్టే పనికి దిగుతున్నారు.
తాజాగా గచ్చిబౌలి పోలీసులు బయటపెట్టిన రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం దీనికి నిదర్శనంగా నిలిచింది. ఇక పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన వారిలో ఐదుగురు ముఠా సభ్యులు ఉన్నారు. వారి నుంచి 220 టన్నుల రేషన్ బియ్యం, 40 బ్యాగుల గోధుమలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు.
అలాగే వీటిని తరలిస్తున్న 4 లారీలు, 4 టాటా ఏస్ వాహనాలను కూడా సీజ్ చేసి.. నిందితులపై కంట్రోల్ యాక్ట్ - 2016 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరోవైపు పేదల కోసం కేటాయించిన రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున సేకరించి, ముఠాలుగా ఏర్పడి ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గౌలిదొడ్డి ప్రాంతం నుంచి కర్ణాటకకు తరలిస్తున్న వందల టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకోవడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది.
ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న బియ్యం నిజంగా అర్హులైన కుటుంబాల ఇళ్లకు చేరాల్సి ఉండగా, మధ్యలోనే అక్రమ రవాణాదారుల చేతుల్లోకి వెళ్లడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే అత్యంత పేద కుటుంబాలే నష్టపోతాయి. రేషన్‌పై ఆధారపడే కుటుంబాలకు సరుకుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొన్నిచోట్ల సరఫరాపై ప్రభావం పడటంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ప్రజల పన్నుల డబ్బుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అసలు లక్ష్యం కూడా దెబ్బతింటుంది. అందుకే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాబట్టి ముఠాల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా నిల్వలు చేసే గోదాములు, కొనుగోలు కేంద్రాలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలి.
పేదలకు చేరాల్సిన ఒక్క గింజ కూడా దారి మళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. లేకపోతే పేదల కోసం ఉద్దేశించిన సన్న బియ్యం రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్లిపోతూ, నిజమైన లబ్ధిదారులు నష్టపోయే పరిస్థితి కొనసాగడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరక పోయే అవకాశం ఉంది..












