క్రైమ్

Adilabad: లంచం తీసుకుంటూ‌‌ ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారులు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు అవినీతి అధికారుల భాగోతం బయటపడింది. రూ.60 వేల లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై నీటి పారుదల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండ్ గా చిక్కారు.

ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి. విమల పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటుకు అవసరమైన ఇరిగేషన్ శాఖ ఎన్‌ఓసీ కోసం రూ.60 వేల లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై నీటి పారుదల శాఖకు చెందిన EE రాథోడ్ మిట్టల్, AE రమేష్ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.

బాధితుడు చౌహాన్ విక్రమ్ ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు వరుసగా లంచావతారులు పట్టుబడుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలు, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ తర్వాత కూడా పలు ప్రయోజనాలు ఉన్నా.. ఎందుకు అక్రమ సంపాదన వైపు అడుగులు వేస్తున్నారనే ప్రశ్న సమాజాన్ని తొలచి వేస్తుంది.

ప్రభుత్వం అవినీతి అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పదే పదే చెబుతోంది. ఏసీబీ దాడులు, సస్పెన్షన్లు, శాఖాపరమైన విచారణలు, కోర్టు కేసులు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా లంచాల కోసం చేతులు చాచడం ఆందోళన కలిగించే విషయం. ఒకవైపు ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు కొందరు అధికారులు అధికారాన్ని అవకాశంగా మార్చుకోవడం ప్రజల్లో వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చినప్పుడల్లా ఒక విషయం స్పష్టమవుతోంది. అవినీతి అనేది కేవలం ఒక వ్యక్తి తప్పు మాత్రమే కాదు, అది మొత్తం పరిపాలనా వ్యవస్థ ప్రతిష్ఠను ప్రభావితం చేసే అంశం. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతగా తీసుకుని పారదర్శకంగా పనిచేస్తేనే ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

అవినీతి నిరోధక సంస్థలు మరింత అప్రమత్తంగా పనిచేయడం ఎంత అవసరమో, అదే స్థాయిలో ప్రజలు కూడా లంచం డిమాండ్ చేసినప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయడం ముఖ్యం.. అప్పుడు చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇక ప్రజా సేవ కోసం ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగిస్తే, ఎప్పటికైనా చట్టం ముందు జవాబు చెప్పాల్సిందేనని ఆదిలాబాద్ ఘటన మరోసారి నిరూపించింది.

#Adilabad#Vimala Poultry Farm#Irrigation Department#NOC#ACB
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి