భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ప్రాంతంలోని సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రాజెక్టుల ప్రాధాన్యత, భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గోదావరి నదిలో లభిస్తున్న నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వివిధ సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఆ దిశగా పనుల వేగాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇటీవల దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన ప్రభుత్వం, ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు పనులను సమీక్షించడం కూడా అదే కార్యాచరణలో భాగమని వివరించారు. తెలంగాణలో గోదావరి జలాలను రైతులకు మరింత చేరువ చేసే కీలక ప్రాజెక్టుల్లో సీతారామ ఒకటని భట్టి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి విస్తీర్ణం పెరగడంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు గతంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్ట్ స్థానంలో.. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, రుద్రంకోట ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రణాళికలు రూపొందించారని గుర్తుచేశారు. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం రీ-డిజైనింగ్ పేరుతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచిందని విమర్శించారు.
రీ-డిజైనింగ్ నెపంతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 24,000 కోట్లకు పెంచేసి ఖజానాపై అదనపు భారం మోపడమే కాదు రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేశారని ఆరోపించారు. ఇప్పటికే ప్రజాధనం భారీ మొత్తంలో ఖర్చయిన నేపథ్యంలో ప్రాజెక్టును మధ్యలో నిలిపివేయడం సాధ్యం కాదని, అందుకే మిగిలిన పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని భట్టి చెప్పారు.
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, గోదావరి నీటిని ఆయా ప్రాంతాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులకు సాగునీటి వసతి పెరిగి, వ్యవసాయ ఉత్పత్తి మరింత మెరుగుపడుతుందని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.












