Thalliki Vandanam: తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. నిధుల విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ నెల 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. తాజాగా ఈ స్కీమ్ కి సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చింది సర్కార్. తల్లికి వందనం స్కీమ్ అర్హుల జాబితాను ఈ నెల 22న స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రకటించనున్నారు. ఆగస్టు 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10వ తేదీన సప్లిమెంటరీ జాబితాను విడుదల చేస్తారు. ఇక కొత్త అడ్మిషన్లకు ఆగస్ట్ 25వ తేదీ వరకు గడువు విధించారు. కొత్తగా చేరిన విద్యార్థుల అర్హుల జాబితాను ఆగస్ట్ 30న ప్రకటించనున్నారు. అదే రోజు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం.
కాగా, తల్లికి వందనం స్కీమ్ కింద మొత్తం 67 లక్షల 47వేల 190 మంది విద్యార్థులకు లబ్ది కలగనుంది. 42 లక్షల 70వేల 802 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేయనున్నట్లు వివరించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. వాటిలో తల్లికి వందనం స్కీమ్ ఒకటి. విద్యార్థుల తల్లులకు ఆర్థిక చేయూతను అందించే లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకొచ్చింది.
1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, ఎయిడెడ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదును నేరుగా జమ చేయనుంది సర్కార్.
ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి మొత్తం 15 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో 13 వేలు మాత్రమే జమ అవుతుంది. మిగతా 2వేల రూపాయలు పాఠశాలల మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం ప్రభుత్వం వినియోగించనుంది.












