* అల్లర్లతో అట్టుడుకుతున్న POK
* నిరసనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు
* హింసాత్మక ఘటనల్లో 28 మంది మృతి
* ఇంటర్నెట్ నిలిపేసిన పాక్ ప్రభుత్వం
* అణచివేతపై భారత్ తీవ్ర ఆగ్రహం
* భారత్‌లో వీలనమవుతామంటూ POKలో నినాదాలు
అల్లర్లు, ఘర్షణలు, నిరసనలతో పాక్ ఆక్రమిత కశ్మీర్ అట్టుడుకుతోంది. దశాబ్దాల తరబడి పాకిస్తాన్ అణిచివేతకు గురవుతున్న ఈ ప్రాంతం ఇప్పుడు ఆజాదీ కోసం కదం తొక్కుతోంది. కొన్ని వారాలుగా రావల్కోట్, ముజఫరాబాద్, బాగ్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అసలు ఈ ఆందోళనలకు కారణమేంటి..? పీఓకే ప్రజలు పాకిస్తాన్ నుంచి ఏం కోరుకుంటున్నారు..?
ఆర్థిక సంక్షోభంతో POK అతలాకుతలం..
పాక్ ఆక్రమిత కశ్మీర్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. దీంతో నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి. నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గంటల తరబడి విద్యుత్ కోతలు పీవోకే లో నిత్యకృత్యం. ఇన్ని సమస్యల మధ్య బతకడం కష్టంగా ఉందని ఇక్కడి ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.
JAAC ఆధ్వర్యంలో నిరసనలు..
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇక్కడి ఆందోళనలకు నేతృత్వం వహిస్తోంది. ఈ కమిటీ ప్రజలను ముందుండి నడిపిస్తోంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో పీవోకేను పట్టించుకోవడమే మానేసింది. ఆ ప్రాంతం వనరులను దోచుకుంటూ ప్రజలను మాత్రం గాలికొదిలేసింది. కొద్ది నెలల కిందట పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో గోధుమ పిండి కూడా దొరకలేదు. ఇక్కడి ప్రజలకు అదే ప్రధానమైన ఆహారం. గోధుమ పిండి ధరలు భారీగా పెరగడంతో.. జనం అల్లాడిపోయారు. వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారు. కొన్ని నెలలుగా ఇదే తంతు. గోధుమ పిండిపై సబ్సిడీని పునరుద్ధరించాలని పీఓకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చి చాలా ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి.
ఉద్రిక్తతలను పెంచిన స్థానిక ఎన్నికలు..
POKలో ఉన్నట్టుండి ఉద్రిక్తతలు పెరగడానికి మరో కారణం స్థానిక ఎన్నికలు. జూలై 27న ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో స్థానికులకు నిజమైన ప్రాతినిధ్యం లేదని, కొన్ని వర్గాలకే రిజర్వ్ సీట్లు కేటాయించారని ఆరోపిస్తూ స్థానిక సంఘాలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. రాజకీయ ప్రక్రియలో తమకు తగిన భాగస్వామ్యం కల్పించనప్పుడు ఈ నామమాత్రపు ఎన్నికలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రచారానికి వస్తున్న రాజకీయ నాయకులకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. స్వాతంత్రం కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని వర్గాల ప్రజలు భారత్‌లో కలిసిపోతామనే స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. పీఓకే మొత్తం ఆందోళనలతో అట్టుడుకుతున్నా.. ప్రజలందరి డిమాండ్లు మాత్రం ఒకే రకంగా లేవు. కొందరు పాలనా సంస్కరణలను కోరుకుంటున్నారు. మరికొందరు రాజకీయ డిమాండ్లను పాక్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఇంకొందరు మాత్రం భారత్‌లో కలిసిపోతామని తెగేసి చెబుతున్నారు. పక్కనే ఉన్న భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. పాకిస్తాన్ మాత్రం వెనక్కి వెళ్లిపోతుందని పీవోకేలోని మేధావి వర్గం ఆరోపిస్తోంది. ప్రధానంగా ఈ వర్గాల నుంచే భారత్‌కు స్నేహ హస్తం అందుతోంది.
పాక్-ఆక్రమిత కశ్మీర్ చరిత్ర ఏంటి..?
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అనేది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీరు భూభాగం. పేరుకే స్వయం పరిపాలనా ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ పరిపాలిస్తుంది. 1947 నుండి భారత్, పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యమున్నా.. అధ్యక్షుడు, ప్రధానమంత్రి పాలనలో భాగస్వాములని చెబుతున్నా... అంతా పాక్ కనుసన్నల్లోనే జరుగుతుంది. ఒకరకంగా ఈ ప్రాంతాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటోంది పాకిస్తాన్. ఇది తెలిసే ఇక్కడి జనాలు ఈ మధ్య తిరుగుబాటు మొదలుపెట్టారు. ఆ ఉద్యమానికి ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం లాంటి అంశాలు తోడయ్యాయి. అందుకే ఇప్పుడు పీవోకే మొత్తం అల్లర్లతో అట్టుడుకుతోంది.
భారత్‌లో కలిసే అవకాశముందా..?
PoKతో కూడిన మొత్తం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని మన దేశం ఎప్పుడూ స్పష్టం చేస్తూనే ఉంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు PoK భారత్‌కు చెందుతుందని పదేపదే ప్రకటించారు. అంతర్జాతీయ వేదికలపైన బలంగా గళం వినిపిస్తున్నారు. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా ఆ దేశం PoK నిరసనలను అదుపు చేయలేక తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే అక్కడి కొన్ని వర్గాల ప్రజలు మన దేశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐతే ఇప్పటికప్పుడు పీవోకే భారత్‌లో కలుస్తుందని మాత్రం చెప్పలేని పరిస్థితి. కానీ భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు.












