Spirituality

Spirituality: శ్రీకృష్ణుడు పూజించే దేవత ఎవరో తెలుసా ?

రచన: Venu4 నిమిషాల పఠనం

కృష్ణం వందే జగద్గురుం అంటారు. అంటే ఈ విశ్వానికి శ్రీ కృష్ణుడు గురువు వంటి వాడు అని. అందుకే ఆయన చెప్పిన భగవద్గీత ఈ నాటికీ మానవులకు నిత్యపారాయణంగా మారింది.

కృష్ణం వందే జగద్గురుం అంటారు. అంటే ఈ విశ్వానికి శ్రీ కృష్ణుడు గురువు వంటి వాడు అని. అందుకే ఆయన చెప్పిన భగవద్గీత ఈ నాటికీ మానవులకు నిత్యపారాయణం. అందులో ప్రతి సందేహానికి సమాధానం దొరుకుతుందంటారు. మరి అలాంటి శ్రీకృష్ణుడు కూడా ఓ దేవతను పూజించాడట. మరి ఎవరా దేవత.. ఏమిటామె ప్రత్యేకత.. తెలుసుకుందామా..

ఉత్తరాదివారు కొలుచుకునే ఓ ప్రసిద్ధ అమ్మవారు.. ‘హరసిద్ధి మాత’. ఈ అమ్మవారిని హరసిద్ధి మాతగా కొలవడం ఎప్పటి నుంచి ఆరంభమైందో చెప్పడం కష్టం. కానీ మహాభారతానికి చెందిన ఓ కథ మాత్రం ఇందుకు కారణంగా వినిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు, జరాసంధుడనే రాజుని సంహరించిన విషయం తెలిసిందే కదా !

జరాసంధుని సైన్యం మీదకు యుద్ధానికి వెళ్లే ముందు శ్రీకృష్ణుడు జగజ్జననిని విజయం కోసం ప్రార్థించారట. తరువాత జరిగిన యుద్ధంలో జరాసంధుడు పరాజయం పాలయ్యాడు. ఈ విజయంతో యాదవులంతా కూడా విపరీతమైన ఆనందాన్ని పొందారట. అప్పటి నుంచి అమ్మవారిని హర్షత్ మాతగా పిలుచుకోసాగారట. ఇందుకు తార్కాణంగా ఇప్పటికీ ఇప్పటికీ గుజరాత్, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లోని యాదవులు (అహిర్లు) ఈమెను తమ కులదేవతగా కొలుస్తారు.

స్వయంగా ఆ కృష్ణుడే ద్వారకకు సమీపంలోని కోయలా దుంగార్‌ అనే చోట హరసిద్ధి మాత ఆలయాన్ని నిర్మించారట. కోయలా దుంగార్‌ కొండ మీద ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చేవారట. ఇక 13వ శతాబ్దానికి చెందిన జగ్దు షా అనే జైన వ్యాపారి గొప్ప దాత, అమ్మవారి భక్తుడు.

పూర్వం కొండపై ఉన్న ఆలయం వల్ల సముద్రంలో ప్రయాణించే ఓడలు అమ్మవారి దృష్టి పడి మునిగిపోయేవట. దీనిని నివారించడానికి జగ్దు షా అమ్మవారిని ప్రార్థించి, కొండ కింద ఆలయాన్ని నిర్మించి ఆ దేవిని కొలువగా.. ఆయన ప్రార్థనలని మన్నించిన అమ్మవారు కూడా, తాను కింద నిర్మించే ఆలయంలో ఉండేందుకు అభయాన్ని ఇచ్చారట.

అమ్మవారు కొండ దిగి వచ్చేటప్పుడు ప్రతి మెట్టుకూ ఒక్కో బలి (త్యాగం) ఇవ్వాలని కోరిందట. జగ్దు షా దానికి అంగీకరించి, చివరకు తన కుటుంబ సభ్యులను, తనను తాను బలి ఇవ్వడానికి సిద్ధపడగా, అమ్మవారు ప్రసన్నురాలై అందరినీ బతికించి, కింద కొలువైందని స్థానిక కథనం. అలా 13వ శతాబ్దంలో జగ్దు షా నిర్మించిన ఆలయం ఇప్పటికీ ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా లోకకల్యాణం కోసం, అధర్మ శిక్షణ కోసం శక్తీ స్వరూపిణిని ఆరాధించాడని చెప్పడానికి ఈ క్షేత్రమే ఒక గొప్ప ఉదాహరణ.. తెలుసుకున్నారుకదా ఇదీ శ్రీకృష్ణుడు పూజించిన దేవత కథ..

#india#Sri Krishna#Dwarka#Koyala Dungar#Harasiddhi Mata Temple
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి