పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా ప్రభుత్వం పలు కీలక బిల్లులను చట్ట సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం అజెండాను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది.
సమావేశాల్లో భాగంగా పలు కీలక చట్టాలను కూడా చేయడానికి సిద్దం అయ్యింది. ఇందులో భాగంగా జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026.. వందేమాతరం ,జనగణమన గీతం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించేలా ఈ బిల్లును రూపొందించింది.
అదేవిధంగా 2026 విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు.. విదేశీ విరాళాల నియంత్రణ (FCRA) సవరణ బిల్లును తీసుకురానున్నారు. అలాగే జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, రిజిస్ట్రేషన్లను ఆలస్యంగా జరగకుండా ఉండేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. వీటితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు (33 నుంచి 37కి) బిల్లు, విక్షిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025, ఆదాయపు పన్ను సవరణ బిల్లుతో పాటు ఎంఎస్ఎంఈ (MSME) రంగ అభివృద్ధికి సంబంధించిన సవరణ బిల్లులను కూడా సభలో ప్రవేశ పెట్టనున్నారు.
ఇక పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేసిన తొలి అజెండాలో 130వ, 131వ రాజ్యాంగ సవరణ బిల్లులు లేకపోయినా, వాటి గురించిన చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ బిల్లులను ముందుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) పరిశీలనకు తీసుకెళ్తారా? లేదా నేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెడతారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
అదే సమయంలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి లోక్‌సభ సచివాలయం ఎంపీలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభలోకి స్మార్ట్ వాచీలు, స్మార్ట్ గ్లాసెస్, పెన్ కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలను తీసుకురావడాన్ని నిషేధించింది. అలాగే పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నాలు, ఆందోళనలు, రాజకీయ నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది.












