రాజకీయాలు

Nizamabad: ముడుపులకు.. మ్యుటేషన్లు.. రెవెన్యూ శాఖలో యథేచ్ఛగా సాగుతున్న దందా!..

రచన: Venu6 నిమిషాల పఠనం

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేయడం ప్రతి రెవెన్యూ అధికారి బాధ్యత. కానీ ప్రస్తుతం రెవెన్యూ శాఖ అవినీతికి, లంచాలకు అడ్డాగా మారింది..

చట్టం అంటే భయం లేదా?

వస్తున్న జీతం సరిపోవడం లేదా?

ప్రభుత్వ ఉద్యోగం అంటే చిన్న చూపా?

అధికారం మాటున అడ్డగోలు వసూళ్లు ఎందుకు?

ప్రజల భూములు, హక్కులు, ఆస్తులకు సంరక్షకుడిగా నిలిచేది రెవెన్యూ శాఖ. ప్రభుత్వ విధానాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడంలో, భూ సమస్యలకు పరిష్కారం చూపడంలో, పారదర్శక పాలనకు బలమైన పునాదిగా నిలవడంలో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేయడం ప్రతి రెవెన్యూ అధికారి బాధ్యత. కానీ ప్రస్తుతం రెవెన్యూ శాఖ అవినీతికి, లంచాలకు అడ్డాగా మారింది.

ఇందుకు నిదర్శనం వరుసగా వెలుగులోకి వస్తున్న లంచావతారుల లీలలు.. ఉచితంగా అందివ్వవలసిన సేవలకు రేట్ ఫిక్స్ చేసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్న ఈ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పోతుంది. తాజాగా వరుసగా వస్తున్న రెవెన్యూ శాఖ ఉద్యోగుల అక్రమాలపై ఉన్నతాధికారులు కొరడా ఝళిపించారు.

నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్‌ చేసిన నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డిని జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి గురువారం సస్పెండ్‌ చేశారు. వ్యవసాయ భూముల్లో అనుమతి లేకుండా ప్లాట్లు ఏర్పాటు చేసినవి, నాలా కన్వర్షన్ అనుమతులు పొందని భూములు, అలాగే అసైన్డ్‌, నిషేధిత భూములకు సంబంధించిన దరఖాస్తులను 2022 నుంచే ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉంచారు.

నిబంధనల ప్రకారం వీటికి మ్యుటేషన్‌లు జరగకూడదు. అయితే దీనికి విరుద్ధంగా నందిపేట్ తహసీల్దార్ భూ యాజమాన్య హక్కుల మార్పిడి చేపట్టిన విషయం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ అధికారులు రెండు వారాల క్రితం గుర్తించారు. వారి నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించి దర్యాప్తు నిర్వహించారు. కొద్ది నెలలుగా మెండోరా 4, నందిపేట్‌ మండల కేంద్రం 3, సీహెచ్‌ కొండూర్‌ 7, లకంపల్లి 9, ఉమ్మెడలో 2 కలిపి మొత్తం 25 మ్యుటేషన్లు అక్రమంగా జరిగాయని సీసీఎల్‌ఏ అధికారులు గుర్తించారు.

నాలా అనుమతులు లేకపోవడంతో పాటు, ఇద్దరు యజమానుల్లో ఒకరికి తెలియకుండానే మ్యుటేషన్లు చేశారు. ఇవి ఆర్డీవో పరిశీలన లేకుండాజరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో 15 రోజుల కిందట ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియాను కలెక్టర్‌ విచారణ అధికారిగా నియమించారు. ఈ విచారణలో ఆర్డీవో అనుమతి లేకుండానే నందిపేట్‌ తహసీల్దార్‌ మ్యుటేషన్‌ చేసి భూమి యజమానికి పాస్‌పుస్తకాలు జారీ చేశారని తేలింది.

గత నాలుగు నెలలుగా ఇలాంటివి అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ అక్రమ వసూళ్ల పర్వంలో ఆపరేటర్లు, ఇతర సిబ్బంది పాత్రపై దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు చాలా మండలాల్లో ఆర్‌ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్లను అడ్డుపెట్టుకుని తహసీల్దార్లు నాలా అనుమతుల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్మూర్‌ డివిజన్‌లోని ఓ మండలంలో నాలా అనుమతులకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

డబ్బులు ఇవ్వకుంటే నిర్మాణాలను నిలిపివేస్తున్నట్టు తెలుస్తుంది.. అదేవిధంగా గోదావరి పరివాహక మండలాలైన నందిపేట్, డొంకేశ్వర్, ఆర్మూర్, బాల్కొండ మండలాల్లోని ఎస్సారెస్పీ భూములకు అక్రమంగా పట్టాలు మంజూరు చేస్తూ.. ఎకరాకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాల్లో కూడా అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో 2 వేల ఎకరాలకు అక్రమంగా పట్టాలు పొందినట్లు తెలుస్తోంది. భారీగా ముడుపులు మ్యుటేషన్ల వ్యవహారంలో చేతుల మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి అక్రమాలు పలు మండలాల్లో గుట్టుగా జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు నిఘా పెడితేనే వాటికి అడ్డుకట్ట పడుతుంది.

#Nizamabad#Nandipet#Tahsildar#Revenue Departmen#Disproportionate Assets
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి