వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల సమీపంలో కొనసాగుతున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీంతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఇక వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగనుండగా, కొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రైతులు పొలాల్లో పనులు చేసే సమయంలో, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు వర్షాల కారణంగా కొంత మేర తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశముంది.
మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సైతం రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.












