తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీజీ20 లీగ్ మ్యాచ్ లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లకు గొప్ప వేదికగా మారిందని పేర్కొన్నారు. ఈనాడు సంస్థ ప్రోత్సాహంతో టీజీ20కి దాదాపు ఐపీఎల్ స్థాయి గుర్తింపు లభించిందన్నారు.
టీజీ20 మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌ను అభినందించిన సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి.. రాష్ట్ర యువ క్రికెటర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీలో లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ, హెచ్‌సీఏతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
క్రీడాకారులకు కేవలం ప్రశంసలు మాత్రమే కాకుండా ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు కూడా నేరుగా అందేలా ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం, నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే షూటర్ ఇషా సింగ్‌కు రూ.3 కోట్ల నగదు బహుమతిని కూడా అందించామని తెలిపారు. అంతేకాకుండా, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, గచ్చిబౌలి స్టేడియం ఆధునీకరణ, ఒలింపిక్ ప్రమాణాల అకాడమీ నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణను దేశంలోనే అగ్ర క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం సంకల్పమని ఇందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
సచిన్ టెండూల్కర్, ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను నేటి యువ క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించిన సీఎం.. కొంత గుర్తింపు వచ్చిన వెంటనే ఏకాగ్రత కోల్పోకుండా, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల్లో విజయం సాధించాలంటే అంకితభావం, కష్టపడి శ్రమించడం, సరైన విశ్రాంతి ఎంతో అవసరమని వివరించారు.
మరోవైపు దేశ గౌరవాన్ని పెంచే గొప్ప క్రీడాకారులుగా తెలంగాణ యువత ఎదగాలని ఆకాంక్షించిన సీఎం, రాష్ట్రాన్ని క్రీడల హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.












