బెంగళూరు నగరంలో ఒక మైండ్ బ్లాక్ అయ్యే విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. ఇళ్ల టెర్రస్‌లపై ఆరేసిన మహిళల లోదుస్తులను దొంగిలించి, వాటిని ఒక రాత్రంతా తనే ధరించి, మరుసటి రోజు తెల్లవారేసరికి గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ అదే స్థానంలో పెట్టేస్తున్న ఓ వింత దొంగను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బాధితులు చాకచక్యంగా ఏర్పాటు చేసిన ఒక రహస్య సీసీటీవీ (CCTV) కెమెరా ఈ విచిత్ర వికృత చేష్టల దొంగను పట్టించడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హోయసల నగర్ పరిధిలో నివసించే ఇద్దరు మహిళలు తమ ఇంట్లో కొద్దిరోజులుగా జరుగుతున్న ఒక వింత పరిణామాన్ని గమనించారు. తాము ఉతికి ఇంటి డాబాపై ఆరబెట్టిన లోదుస్తులు రాత్రి పూట అదృశ్యం కావడం, విచిత్రంగా మరుసటి రోజు ఉదయానికి అవి మళ్లీ అదే చోట ప్రత్యక్షం కావడం వారికి తీవ్ర అయోమయాన్ని, భయాన్ని కలిగించింది. పాతవి తిరిగి వస్తున్నప్పటికీ, అదే సమయంలో కొత్తగా ఆరేసిన మరో జత మాయమవుతుండటంతో.. ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని భావించిన ఆ మహిళలు ఎవరికీ అనుమానం రాకుండా టెర్రస్‌పై ఒక సీక్రెట్ కెమెరాను అమర్చారు.
ఈ క్రమంలో జులై 2వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నిందితుడి కదలికలు ఆ రహస్య కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్‌ను పరిశీలించగా.. అర్ధరాత్రి వేళ ఓ యువకుడు టెర్రస్‌పైకి ఎక్కి, అంతకుముందు రోజు తను దొంగిలించిన లోదుస్తులను తిరిగి అక్కడ పెట్టడం, ఆపై కొత్తగా ఆరేసి ఉన్న మరో జతను తీసుకుని వెళ్లడం కనిపించింది. అంతేకాకుండా, ఆ దుస్తులను పట్టుకుని సదరు యువకుడు టెర్రస్‌పైనే అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా ఆ కెమెరా విజువల్స్‌లో బయటపడింది.
ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పక్కాగా స్కెచ్ వేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని అస్సాం రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల అబ్దుల్ హుస్సేన్‌గా గుర్తించారు. నిందితుడు తీవ్రమైన మానసిక వికారంతో బాధపడుతున్నాడని, మహిళల ప్రవర్తనా రీతులను ప్రదర్శించే సైకో స్వభావం అతడికి ఉందని ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి ఇలాంటివి రెండు ఘటనలు వెలుగుచూశాయని, నగరంలో ఇంకా ఎక్కడైనా ఈ తరహా వికృత చేష్టలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












