విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. తమలో తామే వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు. పర్యవసానం.. విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న అంతర్గత వివాదాల నేపథ్యంలో హెచ్ఎం ఆ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చేసి ఇంటికి పంపించేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ వింత నిర్ణయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు సదరు హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం పరిధిలోని బండరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొద్దికాలంగా ఉపాధ్యాయుల మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ గొడవలు శృతిమించి తరచూ పాఠశాల వాతావరణం దెబ్బతినే స్థాయికి చేరుకున్నాయి. అయితే, పరిస్థితిని చక్కదిద్ది, ఉపాధ్యాయులను సమన్వయం చేయాల్సిన హెచ్ఎం హకీం.. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. టీచర్ల గొడవలను సాకుగా చూపి, స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ టీసీలు మంజూరు చేసి వారిని బడి నుంచి బయటకు పంపించేశాడు.
విద్యార్థులు లేకుండా పాఠశాల వెలవెలబోతుండటంతో ఈ విషయం కాస్తా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) అశోక్ దృష్టికి వెళ్లింది. వెంటనే పాఠశాలపై విచారణ జరిపిన డీఈఓ.. జరిగిన పరిణామాలపై తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ బాధ్యతారాహిత్యంగా విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చి స్కూల్ ఖాళీ కావడానికి ప్రధాన కారణమైన హెచ్ఎం హకీంను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దీనితో పాటు, పాఠశాలలో గొడవలకు కారణమై విద్యా వాతావరణాన్ని దెబ్బతీసిన మరో నలుగురు ఉపాధ్యాయులకు కూడా డీఈవో సీరియస్ మెమోలు జారీ చేశారు. భవిష్యత్తులో విద్యా సంస్థల్లో ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ఘటనలు పునరావృతమైతే కఠినమైన శిక్షలు తప్పవని జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పణంగా పెట్టి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
https://x.com/TeluguScribe/status/2078008673557729502?s=20












