* సీఎం విజయ్.. సంచలన నిర్ణయాలు
* అవినీతికి పాల్పడితే ఖబడ్దార్ అంటూ మంత్రులకు వార్నింగ్
* అవినీతి మరక అంటితే పదవి అవుట్
* తనిఖీల పేరుతో హడావుడి వద్దని క్లాస్
తమిళనాడు సీఎం విజయ్.. అన్నింట్లో తన మార్క్ చూపిస్తున్నారు. ఫక్తు రాజకీయ నాయకులకు భిన్నంగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐతే సీఎం ఎంత నిబద్ధతతో ఉన్నా.. మంత్రులు, కింది స్థాయి నాయకులు, అధికారులు అవినీతికి పాల్పడుతూనే ఉంటారు. అప్పుడు ప్రభుత్వం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. తమిళనాడులో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. ఈ మధ్య కాలంలో టీవీకే నాయకులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఓ నాయకుడైతే లంచం తీసుకుంటూ కెమెరాలకే దొరికిపోయాడు. ఈ క్రమంలో విజయ్ పార్టీ కేడర్‌తో పాటు మంత్రులకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. అవినీతి మరక అంటితే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
అవినీతికి పాల్పడితే మీ పోస్ట్.. ఊస్ట్
కేబినెట్ మీటింగుల్లో తమిళనాడు కేబినెట్ మీటింగులే వేరయా. అవును.. ఈ మీటింగ్‌లు మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా జరుగుతాయి. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు కేబినెట్ మీటింగులు జరిగాయి. ఈ రెండింటిలోనూ విజయ్ తన మార్క్ చూపించారట. ప్రత్యేకించి రెండో కేబినెట్ భేటీ హాట్ హాట్‌గా సాగిందనే వార్తలొస్తున్నాయి. మంత్రుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏ మంత్రికైనా అవినీతి మరక అంటినా, ఆరోపణలు రుజువైనా.. క్షణాల్లో వారి పదవిని రద్దు చేస్తానని హెచ్చరించారు.
మంత్రులకు క్రమశిక్షణ, నిబద్ధతపై కీలక దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు తమకు తెలిసిన వారైనా, తెలియని వారైనా చర్యలు ఒకే రకంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రజాధనాన్ని కాపాడటం, పారదర్శకమైన సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మంత్రులకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. విజయ్ ఉగ్రరూపం చూసిన మంత్రులు బిత్తరపోయారట.
పబ్లిసిటీ స్టంట్స్.. వేండామ్ తంబి
విజయ్ తీసుకున్న మరో నిర్ణయం కూడా సంచలనంగా మారింది. కొందరు మంత్రులు ఆకస్మిక తనిఖీలు, హడావుడి పర్యటనలు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో పబ్లిసిటీ స్టంట్స్.. వేండామ్ తంబి అంటూ సున్నితంగా హెచ్చరించారు. తనిఖీల పేరుతో మంత్రులు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లకూడదని ఆయన స్పష్టం చేశారు. మంత్రుల హడావుడి పర్యటనల వల్ల క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడతారని, అది పరిపాలనా అంతరాయానికి దారితీస్తుందని విజయ్ అభిప్రాయపడ్డారు. తనిఖీల బాధ్యతలను అధికారులకే వదిలేసి, మంత్రులు పాలనాపరమైన విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.
క్లీన్ ఇమేజ్ సాధ్యమేనా..?
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. తొలి ఎన్నికల్లోనే సత్తా చాటారు. సీఎం పీఠమెక్కారు. ఐతే ఆయనకు రాజకీయాలు తెలియవని, రాష్ట్రాన్ని పాలించలేరని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్నారు విజయ్. తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి పబ్లిక్ మీటింగుల దాకా అన్నింట్లో స్పెషల్ మార్క్ చూపిస్తున్నారు.
నాయకులంతా ఒకే రకంగా ఉండరన్ననట్టు.. ఇప్పటికే కొందరు టీవీకే లీడర్లు అవినీతి దుకాణాలు తెరిచారు. అక్కడక్కడ లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలు విజయ్ దాకా చేరడంతో ఆయన సీరియస్ అవుతున్నారు. వారిని అలాగే వదిలేస్తే.. తన ఇమేజ్ దెబ్బ తింటుందని భావించారు. అందుకే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. క్లీన్ ఇమేజ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు విజయ్. ఎలాంటి అవినీతి మరక లేకుండానే తన పాలన ముగియాలని గట్టిగా ఫిక్సయ్యారు. అందుకే పార్టీ నాయకులు, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలే కేబినెట్ భేటీలో మెయిన్ ఎజెండాగా మారాయని తెలుస్తోంది.
కేబినెట్ వేదికగా విజయ్ మంత్రులకు విధించిన డెడ్‌లైన్‌లు, డిసిప్లైన్ రూల్స్ టీవీకే ప్రభుత్వ ఇమేజ్‌ను ప్రజల్లో అమాంతం పెంచేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవినీతి రహిత తమిళనాడు నిర్మాణమే ధ్యేయంగా సీఎం విజయ్ ముందుకెళ్తున్నారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఈ దళపతి సంచలన నిర్ణయాలు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.












