దేశంలో ప్రభుత్వాలు ఎన్ని మారిన రైతుల బ్రతుకులు మారడం లేదు. రైతు సంక్షేమం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్న.. ఎక్కడో ఒక చోట సమస్యలతో రైతు సతమతం అవుతూనే ఉన్నాడు.. వ్యవసాయం అంటే కష్టాలతో కూడుకున్న పని అనే భావనతో బ్రతుకీడుస్తున్నాడు. విత్తనం నాటింది మొదలు పంట చేతికి వచ్చి అమ్ముడుపోయి.. డబ్బులు చేతిలో పడే వరకు దినదినం యుగంలా బ్రతికుతున్నాడు.
ఇలా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ప్రస్తుతం ఎరువుల ధరలు రైతుకు గుదిబండలా మారాయి.. నెల రోజుల క్రితం రూ.1,500 ఉన్న 45 కిలోల ఎరువు బస్తా ప్రస్తుతం రూ.2,150కు చేరింది. ఎకరానికి మూడు బస్తాలు వాడితే రైతులపై అదనంగా రూ.1,950 భారం పడుతుంది.
ఇలా ఆకాశాన్నంటే ఎరువుల ధరలతో రైతులు నలిగిపోతుంటే.. వ్యాపారులు గుళికలు కొంటేనే అవసరమైన ఎరువులు ఇస్తామని లంకె పెడుతున్నారని వాపోతున్నారు. ఒకవైపు డీఏపీ ఎక్కడా దొరకడం లేదు. యూరియా పక్కదారి పడుతోంది. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదలతో ట్రాక్టర్లు, హార్వెస్టర్ యంత్రాల అద్దెలు విపరీతంగా పెరిగి దడ పుట్టిస్తున్నాయి. విత్తనాలు, కూలీల ధరలదీ కూడా అదే పరిస్థితి..
మొత్తానికి ఒక్కో బస్తా ఎరువు పై రూ.300 నుండి 600 వరకు అదనపు భారం పడుతుండటంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమాసియా యుద్దాన్ని సాకుగా చూపిస్తూ ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతి ఖర్చులు పెరిగాయని చెబుతూ.. ఆయా కంపెనీలు ఎరువుల ధరలను పెంచాయి. కొందరు డీలర్లు అయితే ఇదే అదనుగా పాత స్టాక్‌నే కొత్త ధరలకు విక్రయిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రాయితీపై డీఏపీ బస్తా ధర రూ.1350, యూరియా రూ.266కు అందిస్తోంది. అయితే, రాష్ట్రంలో డీఏపీ చాలా జిల్లాల్లో దొరకడం లేదని అంటున్నారు.. మరోవైపు కాంప్లెక్స్ ఎరువులు పాత బస్తాల ఎమ్మార్పీ రూ.1,450 ఉండగా, ప్రస్తుతం రూ.1,800కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. తాజాగా పెరిగి రూ.1,800 అయిన ఎరువుల బస్తాలను రూ.2,150కి అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యూరియా బుకింగ్ ప్రక్రియపై రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మండల వ్యవసాయ అధికారులు, ఎరువుల డీలర్లు ముందస్తు సమాచారంతో కొందరు వ్యక్తులకు బుకింగ్ అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్ణయించిన సమయానికి ముందు భారీగా బుకింగ్‌లు నమోదు కావడంతో, అధికారికంగా బుకింగ్ ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే నిల్వలు పూర్తవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఈ తరహా పరిస్థితులు అధికంగా ఉన్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో రైతుల కోసం కేటాయించిన యూరియా సంచులను ఓ ఎరువుల డీలర్ ఇతరులకు విక్రయించినట్లు గుర్తించిన అధికారులు విచారణ చేపట్టి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తూ.. ఎరువుల డీలర్ల పై కూడా కఠిన చర్యలు చేపడితే కొంత వరకైనా రైతులకు మేలుకలిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు..












