బ్రతకడానికి ఒక ఉద్యోగం.. అందులో ఆకర్షణీయమైన జీతం ఉంటే చాలు హాపీగా బ్రతికేయవచ్చని ప్రతి యువతి యువకులు భావిస్తారు.. ఇందుకోసం ఎన్నో కలలుకంటారు.. కొందరైతే నిద్రలేని రాత్రులు కూడా గడుపుతూ ఉద్యోగాల కోసం కుస్తీ పడతారు. కానీ వీరందరికంటే భిన్నంగా వ్యవహరించాడు ఓ వ్యక్తి..
ఏడాదికి రూ.90 లక్షల జీతం... ఈ ఆఫర్ వస్తే ఎవరైనా వెంటనే అంగీకరిస్తారని అనుకుంటాం. కానీ ఓ అభ్యర్థి మాత్రం ఆ భారీ ప్యాకేజీని ఏమాత్రం ఆలోచించకుండా తిరస్కరించాడు. కారణం జీతం కాదు... మరో కంపెనీ ఆఫర్ కాదు... తాను రిపోర్ట్ చేయాల్సిన మేనేజర్.
ఈ ఆసక్తికర ఘటనను హెచ్‌ఆర్ కన్సల్టెంట్, వ్యాపార సలహాదారు మనోజ్ కుమార్ తన లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. ఒక ప్రముఖ సంస్థలో సీనియర్ లీడర్‌షిప్ పోస్టు కోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఆయన వారాల తరబడి శ్రమించారు. అనేక ఇంటర్వ్యూలు, చర్చల తర్వాత చివరకు ఓ వ్యక్తిని ఎంపిక చేశారు. కంపెనీ కూడా ఏడాదికి రూ.90 లక్షల ప్యాకేజీతో ఆఫర్ లెటర్ అందించింది.
అన్నీ సవ్యంగా పూర్తయ్యాయని భావించిన సమయంలో ఆ అభ్యర్థి నుంచి వచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆఫర్ చాలా బాగుంది. కానీ నేను రిపోర్ట్ చేయాల్సిన వ్యక్తితో పని చేయడం నాకు సౌకర్యంగా అనిపించడం లేదు. అందుకే ఈ ఉద్యోగాన్ని అంగీకరించలేనని చెప్పి వారికి షాకిచ్చాడట..
ఈ ఘటన తర్వాత మనోజ్ కుమార్ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. ఉద్యోగులు కేవలం కంపెనీలను మాత్రమే ఎంచుకోరని, తమను నడిపించే నాయకులను కూడా ఎంచుకుంటారని చెప్పారు. మంచి జీతం ఉద్యోగంలో చేరేలా చేస్తుంది. కానీ మంచి మేనేజర్ మాత్రమే ఉద్యోగిని ఎక్కువకాలం ఆ సంస్థలో కొనసాగించేలా చేస్తాడని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టుకు నెటిజన్ నుండి భారీ స్పందన లభించింది. డబ్బు అన్నీ సౌకర్యాలను కల్పిస్తుంది.. కానీ ప్రశాంతమైన పని వాతావరణం జీవితాన్ని కాపాడుతుందని ఒకరు.. జీతం ఇంటర్వ్యూ టేబుల్ వరకు తీసుకెళ్తుంది... కానీ నమ్మకం మాత్రమే ఉద్యోగాన్ని అంగీకరించేలా చేస్తుందని మరొకరు స్పందించారు.
ఈ ఘటన ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. నేటి ఉద్యోగ ప్రపంచంలో భారీ జీతం మాత్రమే విజయానికి ప్రమాణం కాదు. గౌరవించే నాయకత్వం, ఆరోగ్యకరమైన పని సంస్కృతి, ఉద్యోగికి విలువ ఇచ్చే మేనేజర్ కూడా అంతే ముఖ్యమైనవి. ఎందుకంటే మంచి ఉద్యోగం అంటే కేవలం ఎక్కువ జీతం కాదు... మనసుకు ప్రశాంతతను ఇచ్చే పని వాతావరణం కూడా అని తెలియచేస్తుంది.












