Viral RBI Letter: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. డబ్బు ఆశ చూపి చీట్ చేస్తున్నారు. తాజాగా ఆ తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేరుతో మోసానికి తెరలేపారు కేటుగాళ్లు. ఆర్బీఐ పేరుతో సోషల్ మీడియాలో ఒక లెటర్ సర్కులేట్ అవుతోంది. అందులో ఉన్న సారాంశం ఏంటంటే.. 7వేల 500 రూపాయలు రీఫండబుల్ ట్యాక్స్ చెల్లిస్తే లక్ష రూపాయలు అందిస్తామని ఉంది. ఆర్బీఐ పేరుతో లేఖ ఉండటంతో ఇది నిజమే అని చాలా మంది నమ్మేశారు. అయితే ఇది నిజం కాదని, ఇది ఫేక్ లెటర్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా మోసపూరితమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అసలు ఆ లేఖను ఆర్బీఐ జారీ చేయలేదని పీఐబీ క్లారిటీ ఇచ్చింది. ముందస్తు చెల్లింపుల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని వివరించింది. పన్నులు, ప్రాసెసింగ్ ఫీజులు లేదా ఇతర రుసుముల పేరుతో డబ్బు చెల్లిస్తే నగదు బహుమతులు ఇస్తామని ఆర్బీఐ ఎప్పుడూ లేఖలు పంపదని తేల్చి చెప్పింది. అసలు ఆర్బీఐ అలాంటి పథకాలను ప్రకటించదని వెల్లడించింది.

ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా, ఈజీగా అట్రాక్ట్ అయ్యేలా.. ప్రభుత్వ సంస్థల పేర్లు, అధికారిక లోగోలతో నకిలీ పత్రాలు క్రియేట్ చేసి.. వాటి ద్వారా ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తుంటారని సైబర్ నిపుణులు పేర్కొన్నారు. ముందుగా చిన్న మొత్తంలో నగదు కడితే తర్వాత భారీ మొత్తం ఇస్తామని ఆశ పెడతారు. ఆ ప్రకటనలకు టెంప్ట్ అయ్యి డబ్బు చెల్లించామో ఇక అంతే సంగతులు.. ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్ ఆ డబ్బుతో జారుకుంటారు. కొన్ని సందర్భాల్లో మన బ్యాంకు ఖాతాలను ఖాళీ కూడా చేసేస్తారు.
ఆర్బీఐ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ లెటర్ సర్కులేట్ అవుతున్న అంశంపై సైబర్ నిపుణులు స్పందించారు. ఇలాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద సందేశాలకు స్పందించొద్దని, ఎవరికీ ఎటువంటి చెల్లింపులు చేయవద్దని ప్రజలకు సూచించారు. ఏదైనా సమాచారం అందినప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. అధికారిక మార్గాల ద్వారా వాస్తవాలను ధ్రువీకరించుకోవాలన్నారు. గుడ్డిగా ముందుకు వెళ్లకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిదన్నారు. ఒకవేళ ఎవరైనా మోసాల బారిన పడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే స్పందించడం ద్వారా మీ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
'రీఫండబుల్ టాక్స్' (తిరిగి పొందే అవకాశం ఉన్న పన్ను) కింద రూ. 7,500 చెల్లిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లక్ష రూపాయలను విడుదల చేస్తుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న లేఖ నకిలీది. ఆ లేఖను RBI జారీ చేయలేదు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగం'' అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 'ఫ్యాక్ట్ చెక్' విభాగం స్పష్టం చేసింది.
''అటువంటి సందేశాలు లేదా లేఖలకు స్పందించి డబ్బు చెల్లించవద్దు. ఆ ప్రకటనకు RBIతో గానీ ప్రభుత్వం ఆమోదించిన ఏ పథకంతోనూ గానీ ఎటువంటి సంబంధం లేదు. ముందస్తు చెల్లింపులు, పన్నులు లేదా ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో నగదు చెల్లింపులు చేస్తామని హామీ ఇస్తూ RBI ఎటువంటి లేఖలను జారీ చేయదు. మోసగాళ్లు తరచుగా ప్రభుత్వ సంస్థల పేర్లు లేదా లోగోలతో కూడిన నకిలీ పత్రాలను ఉపయోగించి, తమ మోసాలను నిజమైనవిగా నమ్మించి ప్రజల నుండి డబ్బును బదిలీ చేయించుకుంటారు'' అని PIB ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది.
''అనుమానాస్పదమైన అలాంటి సందేశాలపై స్పందించే ముందు, ఇతరులతో పంచుకునే ముందు వాటిని అధికారిక ప్రభుత్వ మార్గాల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలి. అలాంటి సందేశాలు అందుకున్న పౌరులు వాటిని తమ అధికారిక వాస్తవ తనిఖీ వేదిక ద్వారా నివేదించాలి. అంతేకానీ ఆ సందేశాలు పంపిన వారిని సంప్రదించరాదు. ప్రభుత్వ విభాగాలు, ఆర్థిక సంస్థల పేర్లను తప్పుగా ఉపయోగించి అమాయకులను మోసం చేసే ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సమాచారాలపై మాత్రమే ఆధారపడాలి'' అని అధికారులు పదేపదే సూచిస్తున్నారు.












