ఏపీ

భయపడొద్దు, ప్రమాదకర వేరియంట్ కాదు- ఏపీలో కరోనా వ్యాప్తిపై మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

రచన: NK4 నిమిషాల పఠనం

కరోనాపై అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. జిల్లాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ పై ప్రజలు ఎవరూ కూడా భయపడొద్దని మంత్రి సత్యకుమార్ చెప్పారు.

AP Corona Cases: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. ఏపీలోనూ కరోనా వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 26వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఏపీలో మొత్తం 13 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 67 మందికి చెందిన నమూనాలు పరిశీలించగా 13 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కడప, విశాఖ, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో కేసులు గుర్తించారు. కాగా, కోవిడ్ బారిన పడ్డ వారిలో నలుగురు మృతి చెందడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, వారందరికి ముందే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో మంత్రి సత్యకుమార్ స్పందించారు. కరోనాపై అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. జిల్లాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ పై ప్రజలు ఎవరూ కూడా భయపడొద్దని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, ఎక్కడైనా కేసులు వస్తే వెంటనే ట్రేసింగ్ చేయడం, ఐసోలేషన్ వార్డులో పెట్టడం లేదా హోమ్ ఐసోలేషన్ లో పెట్టడం చేస్తున్నామన్నారు.

''కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ప్రమాదకర వేరియంట్ కాదు. కోవిడ్ తో పాటు హెమటాలజీ, హై బీపీ కారణంగానే మరణించారు. ఏ రకంగా కూడా ప్రజలు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వస్తున్న కేసులను నిరంతరం కేంద్రానికి తెలియజేస్తున్నాము. ఇది ప్రమాదకరమైన వేరియంట్ కాకపోయినప్పటికి ముందు జాగ్రత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణె వైరాలజీ ల్యాబ్ కు శాంపుల్స్ పంపాము. జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత అసలు వేరియంట్ తెలుస్తుంది. అదే సమయంలో కావాల్సిన ఆర్టీపీసీఆర్ ఎక్కువ చేస్తున్నాం. పరీక్షలు ఎక్కువ చేస్తే కొద్దీ కేసులు వస్తుంటాయి. జ్వరం, దగ్గు, జలుబుతో ఆసుపత్రికి వస్తే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం'' అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

#AP Corona Cases#Andhra Pradesh#Covid Virus#Covid 19#Corona Cases#Satya Kumar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి