National

ISRO: అంతరిక్ష రంగంలో కలకలం.. ఇస్రోను వీడుతున్న సైంటిస్టులు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్తుతం కీలక సవాల్‌ను ఎదుర్కొంటోంది. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు ఇస్రో ను వదిలి వెళ్ళడం సమస్యగా మారింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్తుతం కీలక సవాల్‌ను ఎదుర్కొంటోంది. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు ఇస్రో ను వదిలి వెళ్ళడం సమస్యగా మారింది. గత కొన్ని నెలలుగా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేయడం, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా దేశానికి అత్యంత ప్రాధాన్యం ఉన్న అంతరిక్ష మిషన్ల సమయంలోనే 100 మందికి పైగా కీలక సైంటిస్టులు సంస్థను వీడటం చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతరిక్ష శాఖ అప్రమత్తమైంది. గగన్‌యాన్ వంటి జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, సిబ్బంది రాజీనామాలు చేయాలంటే ఇకపై ప్రత్యేక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

మరోవైపు శాస్త్రవేత్తలు ఇస్రోను వీడటానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. 2020 సంవత్సరానికి ముందు భారతదేశంలో అంతరిక్ష రంగానికి సంబంధించిన పనులన్నీ ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో (ISRO) మాత్రమే చేసేది. ఇందులో ప్రైవేట్ కంపెనీలకు సొంతంగా ప్రయోగాలు చేసే అవకాశం ఉండేది కాదు. కానీ 2020లో భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు కూడా అందుబాటులోకి తెచ్చింది..

ఫలితంగా స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధ్రువ స్పేస్ వంటి స్టార్టప్ సంస్థలు వేగంగా ఎదిగాయి. ఇస్రోతో పోలిస్తే ఈ సంస్థలు అధిక జీతాలు, స్టాక్ ఆఫ్షన్లు, వేగంగా కెరీర్ ఎదుగుదల, నాయకత్వ బాధ్యతలు, కొత్త టెక్నాలజీపై పని చేసే అవకాశాలను అందిస్తుండటంతో సైంటిస్టులు చాలా మంది ప్రైవేట్ రంగాన్ని ఎంచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు..

అదే సమయంలో ఇస్రోలోని కొన్ని కీలక మిషన్లు పదేపదే వాయిదా పడటం కూడా శాస్త్రవేత్తల్లో నిరుత్సాహాన్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. గగన్‌యాన్ జీ1, SSLV-L1, GSLV-F17,పరిశ్రమ నిర్మిత PSLV-N1 వంటి అనేక ప్రయోగాలను ప్రకటించారు. కానీ ఇవి ఇప్పటికీ జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఎదురైన వైఫల్యాలకు సంబంధించిన అంచనాలను ఏజెన్సీ ఇంకా బహిరంగంగా విడుదల చేయలేదు.

ప్రస్తుతం ఇస్రోలో 14 వేల 600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ, సంస్థను వీడుతున్న వారిలో చాలామంది చంద్రయాన్-3, స్పాడెక్స్, గగన్‌యాన్ వంటి ప్రతిష్ఠాత్మక మిషన్లలో కీలక పాత్ర పోషించిన వారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరి స్థానాన్ని కొత్తవారితో భర్తీ చేయడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో భారత అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తున్న ఇలాంటి సమయంలో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను కాపాడుకోక పోవడం ఇస్రో కు సవాల్‌గా మారింది.

#india#Key scientists#leaving ISRO#Over 100 scientists#resigned#Space Sector
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి