వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. స్కూల్ వ్యాన్ ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బెర్హంపోర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వ్యాన్ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రైల్వే గేట్ తెరిచి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వేశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. గేట్ మెన్, సూపర్ వైజర్ ను సస్పెండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు స్కూల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కాంగ్రెస్ నేత ధీర్ రంజన్ చౌదరి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. గేట్‌మ్యాన్ లెవెల్ క్రాసింగ్ గేట్‌ను తెరిచి ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.
ప్రమాదం జరిగిన తర్వాత తూర్పు రైల్వే హౌరా డివిజన్‌లోని అజీమ్‌గంజ్-కట్వా సెక్షన్‌లో రైలు సేవలకు కాసేపు అంతరాయం కలిగింది. ప్రమాదంలో పూర్తిగా డ్యామేజ్ అయిన స్కూల్ వ్యాన్‌ను అక్కడి నుంచి తొలగించారు. తర్వాత సాధారణ రైలు సర్వీసులను పునరుద్ధరించారు. ముర్షిదాబాద్ రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ఇద్దరు రైల్వే ఉద్యోగుల సస్పెన్షన్..
అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ADRM) నేతృత్వంలోని 10 మంది సభ్యుల దర్యాప్తు బృందం ముర్షిదాబాద్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు రైల్వే ఉద్యోగులను, ఒక గేట్‌మెన్, ఒక సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేశారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.












