* ఇప్పటిదాకా సోషల్ మీడియా వార్
* ఇకపై APP వేదికగా రాజకీయ యుద్ధం
* మారుతున్న పొలిటికల్ గేమ్
* జగన్ 2.O APP లాంచ్ చేసిన వైసీపీ
* సొంత APP లపై రాజకీయ పార్టీల ఫోకస్
* పార్టీల పొలిటికల్ వార్ 2.O
సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న కొద్దీ.. రాజకీయ పార్టీల వ్యూహాలు కూడా మారుతున్నాయి. కొద్ది రోజులుగా సోషల్ మీడియాపై విపరీతంగా ఆధారపడ్డాయి పార్టీలు. సొంత ప్లాట్‌ఫామ్స్ డెవలప్ చేసుకోవడంతో పాటు ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రచారం చేయించుకున్నాయి. జనానికి చెప్పాలనుకున్నది సోషల్ మీడియా ద్వారానే చెప్పుకుంటూ వచ్చాయి. సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోతే.. పార్టీయే లేదన్న స్థాయిలో రాజకీయాలు మారిపోయాయి.
సోషల్ మీడియా టూ సొంత APP..
ఇప్పుడు రాజకీయ పార్టీల సోషల్ మీడియా ఉద్యమం కాస్త కొత్త టర్న్ తీసుకుంది. సొంత APP దిశగా పార్టీలు అడుగులేస్తున్నాయి. తాజాగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సరికొత్త APP ను లాంచ్ చేశారు. నాయకులు, కార్యకర్తలను నేరుగా అనుసంధానం చేయడానికి అధికారికంగా 'జగన్ 2.0 సూపర్ యాప్' ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను నేరుగా పర్యవేక్షించే అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు.
ఈ యాప్ ద్వారా పార్టీ మీటింగ్‌లు, మీడియా సమావేశాలు, కీలకమైన ప్రకటనలు లైవ్ ఫీడ్ ద్వారా కార్యకర్తలకు చేరుతాయి. రాజకీయంగా లేదా పోలీసుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే కార్యకర్తలు నేరుగా ఈ యాప్ ద్వారా తమ సమస్యలను, వివరాలను ఫిర్యాదు చేయవచ్చని కూడా జగన్ చెప్పారు. పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులను రికార్డ్ చేయడానికి డిజిటల్ డైరీని కూడా అందుబాటులోకి తెచ్చారు.
వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కార్యకర్తల కోసం ఓ యాప్‌ను లాంచ్ చేయడం... రాజకీయాల్లో సరికొత్త మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో డిజిటల్ నెట్‌వర్కింగ్, సోషల్ మీడియా వ్యూహాలు అత్యంత కీలకంగా మారాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సోషల్ మీడియా వేదికల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేస్తున్న కంటెంట్‌ను కుట్రపూరితంగా డిలీట్ చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టడానికే జగన్ 2.0 సూపర్ యాప్ ను తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఇది పూర్తి స్థాయిలో పార్టీకి చెందిన సొంత యాప్ కావడం వల్ల కార్యకర్తలకు స్వేచ్ఛ లభిస్తుందని చెప్పారు.
రాజకీయ పార్టీలు సొంత APPలను ఎందుకు తెస్తున్నాయి..?
రాజకీయాల్లో ఎదుటి పార్టీలను తట్టుకొని నిలబడాలంటే, ఎప్పటికప్పుడు వ్యూహాలను అమలు చేయాలంటే.. ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడాల్సిందే. అంటే ప్రతి సెకన్ ప్లాన్స్‌తో సిద్ధంగా ఉండాలన్నమాట. ఇందుకోసం నిన్న మొన్నటి దాకా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను వాడుకున్నాయి పార్టీలు. ప్రతి పార్టీ ఈ విషయంలో సీరియస్‌గానే ముందుకెళ్లాయి. రాజకీయ పార్టీల కార్యాలయాల్లో సోషల్ మీడియా వింగ్‌లనే ఏర్పాటు చేసుకున్నాయి.
సోషల్ మీడియా అనేది ఓపెన్ డయాస్ కావడంతో... ప్రతి పార్టీ విమర్శకు ప్రత్యర్థి పార్టీ కౌంటర్ కూడా వెంటనే వచ్చేస్తున్నాయి. ఐతే ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు చేస్తున్న పోస్టులను కుట్రపూరితంగా మరో పార్టీ డిలీట్ చేస్తుందన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఇది సోషల్ మీడియా వార్ తీవ్రస్థాయికి చేరడంలో భాగంగా భావించవచ్చు. టీడీపీపై వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ కూడా ఇదే. అందుకే పార్టీలు సొంత యాప్‌లపై ఫోకస్ చేస్తున్నాయి.
సొంత APPల వల్ల లాభాలేంటి..?
పార్టీలు సొంత యాప్‌లను లాంచ్ చేయడం ద్వారా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడకుండా, పార్టీ నాయకుల ప్రసంగాలు, చేపడుతున్న కార్యక్రమాలు, మేనిఫెస్టోను నేరుగా ఓటర్లకు చేరవేయవచ్చు. కార్యకర్తల అభిప్రాయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి డేటాను సేకరించి ఎన్నికల వ్యూహాలను మార్చుకోవచ్చు.
పార్టీ సభ్యులను సులభంగా చేర్చుకోవడం, ప్రతి కార్యక్రమంలో వారిని భాగస్వామ్యులను చేయడం తేలికవుతుంది. సోషల్ మీడియాలో పార్టీపై జరిగే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ మధ్య పార్టీలు సోషల్ మీడియాను దాటి యాప్‌లపై ఫోకస్ చేస్తున్నాయి.
భవిష్యత్ రోజుల్లో భారత రాజకీయాలన్నీ డిజిటల్ వ్యవస్థల చుట్టే తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనానికి కూడా గతంలో లాగా తీరిక ఉండడం లేదు. ఉదయాన్నే పేపర్ చదవడం, న్యూస్ ఛానెల్‌లో వార్తలు వినడం తగ్గించేశారు. వారికి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు వార్తలు తెలుసుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల హవా పెరిగింది. ఇప్పుడు అది యాప్‌ల దాకా వచ్చింది. 2029లో జరిగే సాధారణ ఎన్నికల లోపు ప్రతి పార్టీ సొంత యాప్‌ను తయారు చేసుకోవడం పక్కాగా కనిపిస్తోంది. కార్యకర్తలతో టచ్‌లో ఉండాలంటే, ఎన్నికల్లో సునాయాసంగా గెలవాలంటే, ఎదుటి పక్షాల విమర్శలను తిప్పి కొట్టాలంటే.. యాప్ యజ్ఞం చేయక తప్పదు మరి.












