తెలంగాణ

Rain Alert: అల్పపీడనంతో వానలు.. చల్లబడిన తెలంగాణ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఉత్తర ఒడిశా - పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాన్ని ఆనుకుని బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడుగా బలమైన ఉపరితల ద్రోణి కూడా తోడవడంతో తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాల్లో వర్షాలు ఊపందుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వానలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి.

గడిచిన 24 గంటల్లోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో గరిష్టంగా 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. వీటితో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వాన జల్లులు పడ్డాయి. నిన్న పగటిపూట నిజామాబాద్‌లో సాధారణం కంటే 3.8 డిగ్రీలు అధికంగా 35.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, సాయంత్రానికి చల్లని గాలులు వీచడంతో జనం కాస్త స్థిమితపడ్డారు.

మరోవైపు, నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో ముసురు పట్టుకోకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు ఈ తాజా వర్షాలు కొత్త ఆశలు చిగురింపజేశాయి. వానలు లేక వానాకాలం సాగు పనులు నత్తనడకన సాగుతుండగా, ప్రస్తుత అల్పపీడన జల్లులు పదునుకు పనికొస్తాయని, ఎండిపోతున్న నారుమళ్లకు జీవం పోస్తాయని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు లేకపోయినా, ఈ ముందస్తు జల్లులు ఎండల తీవ్రతను తగ్గించి అటు ప్రజలకు, ఇటు వ్యవసాయ రంగానికి మేలు చేకూరుస్తున్నాయి.

 

#telangana-rains#low-pressure-bay-of-bengal#weather-forecast-hyderabad#kharif-season-farmers#monsoons-telangana#heavy-winds-alert
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి