ఏపీ

AP: కోవిడ్ కలకలం.. అలర్ట్ అయిన ప్రభుత్వం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల (జులై 1) నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 340కి పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల (జులై 1) నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 340కి పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 20 రోజుల్లోనే రాష్ట్రంలో కేసుల సంఖ్య వేగంగా పుంజుకుని, 13 దాటడం కలవరపెడుతోంది. జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు రాగా, గుంటూరులో 3, విశాఖపట్నం, కాకినాడల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఈ మహమ్మారి తీవ్రత వల్ల ఏపీలో ఇప్పటికే నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిలో ముగ్గురు హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరు కాకుండా కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో, ఆమెను మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. కాగా, వైరస్ తీవ్రతను, కొత్త వేరియంట్ల ఉనికిని గుర్తించేందుకు బాధితుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను అధికారులు పూణేలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు.

రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. వైద్యాధికారులను హై అలర్ట్‌లో ఉంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షల కిట్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో కోవిడ్ తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి నేడు మధ్యాహ్నం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

కరోనా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం ప్రజలకు పలు సూచనలు చేసింది. వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది. గుంపులుగా ఉండటం, జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం తగ్గించుకోవాలని స్పష్టం చేస్తూ, స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారానే మహమ్మారి వ్యాప్తిని అరికట్టగలమని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

#covid-updates#corona-cases#andhra-pradesh-covid#ap-health-alert#covid-deaths#genome-sequencing
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి