ప్రధాని నరేంద్ర మోదీ నేడు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ మౌలిక వసతుల కల్పన, రైల్వే రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో మొత్తం రూ.26,800 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన ద్వారా అటు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాలకు కూడా రైల్వే పరంగా పెద్ద పీట వేయబోతున్నారు.
పర్యటనలో భాగంగా హర్యానాలోని జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా పర్యావరణహిత రవాణా వ్యవస్థకు మైలురాయిగా నిలిచే జింద్-సోనిపట్ మధ్య నడవబోయే దేశపు సరికొత్త హైడ్రోజన్ రైలును ఆయన ప్రారంభించనున్నారు. దీనితో పాటు చారిత్రక నగరమైన కురుక్షేత్రలో సిక్కు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక సిక్కు మ్యూజియానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
ఆ తర్వాత చండీగఢ్ వేదికగా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థ పీజీఐఎంఈఆర్ (PGIMER) లో అత్యాధునిక వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త వైద్య కేంద్రాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ పంజాబ్ మీదుగా సాగే కీలకమైన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా ఆయన ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు.
మరోవైపు రైల్వే ప్రయాణికులకు ఆధునిక వసతులు కల్పించే క్రమంలో దేశవ్యాప్తంగా నూతనంగా ముస్తాబైన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ ఒకేసారి ప్రారంభించనున్నారు. ఈ డిజిటల్ ప్రారంభోత్సవాల్లో తెలుగు రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి, రాయనపాడు రైల్వే స్టేషన్లతో పాటు ప్రకాశం జిల్లాలోని కంబం రైల్వే స్టేషన్‌ను కూడా ప్రధాని మోదీ ఈ పర్యటన ద్వారానే జాతికి అంకితం ఇవ్వనుండటం విశేషం.












