క్రైమ్

సీఎం గోప్య సమాచారం లీక్.. ‘తెలుగు స్క్రైబ్‌’పై కేసు నమోదు

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో లీక్ చేసిన ఉదంతం కలకలం రేపుతోంది.

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో లీక్ చేసిన ఉదంతం కలకలం రేపుతోంది. సీఎం పర్యటన వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బహిర్గతం చేసినందుకు గాను ప్రముఖ సోషల్ మీడియా హ్యాండిల్ 'తెలుగు స్క్రైబ్' పై తాజాగా కేసు నమోదైంది. ముఖ్యమంత్రి భద్రత, పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలను ముందే లీక్ చేయడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ISW) ఉన్నతాధికారి అధికారికంగా ఫిర్యాదు చేశారు. సీఎం భద్రతకు ముప్పు వాటిల్లేలా, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన పర్యటన షెడ్యూల్‌ను సోషల్ మీడియాలో పెట్టడంపై ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 మరోవైపు, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఈ లీకేజీ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కార్యాలయానికి లేదా ప్రభుత్వ విభాగాలకు మాత్రమే పరిమితం కావాల్సిన ఈ గోప్య సమాచారం తెలుగు స్క్రైబ్ ప్రతినిధులకు ఎలా చేరిందనే కోణంలో నిఘా పెట్టింది. లోపల ఉన్న కొందరు అధికారులే ఈ సమాచారాన్ని బయటకు చేరవేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రహస్యాలను చేరవేసిన ఆ నల్ల గొర్రెలను ఏరిపారేసేందుకు సీఎంవో గట్టి చర్యలకు ఉపక్రమించింది.

ఈ లీకేజీకి కారకులైన అధికారులను గుర్తించేందుకు అంతర్గత విచారణను వేగవంతం చేశారు. సదరు అధికారుల కాల్ డేటాతో పాటు, ఇటీవల వారు జరిపిన చాటింగ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటనల భద్రతా నియమావళిని ఉల్లంఘించి, సమాచారాన్ని సోషల్ మీడియాకు లీక్ చేసిన అధికారులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ కేసులో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

 

#telugu-scribe#case-registered#chief-minister-tour#info-leak#x-platform#hyd-police
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి