స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

నీళ్లో రామచంద్ర!

రచన: Swechaanews Chairman9 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రజలు నీళ్లకోసం కళ్లల్లో నీళ్లు తిరిగేలా ఆశగా చూస్తున్నారు. మరో నెల రోజులు ఇలానే కొనసాగితే తమ భవిష్యత్ ఎంటని ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు నీటిమట్టాలు పడిపోవడంతో ఇప్పటికే వేసిన పంటలతో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

  • ముఖం చాటేసిన వానలతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన

  • చుక్క నీరు లేని వాగులు, వంకలు, నదులు?

  • 45 ఫీట్లకు పైగా పడిపోయిన సగటు భూగర్భ జలాలు

  • డెడ్ స్టోరేజీలో భారీ ప్రాజెక్టులు

  • మిషన్ భగీరథకు, నగర మంచి నీటికి ఇబ్బందే?

  • మరో నెల రోజులు ఇలానే కొనసాగితే త్రిముఖ వ్యూహం తప్పనిసరి

  • ఇప్పటివరకు కాగితాలకే పరిమితం అయిన ప్లాన్స్?

  • ఎండిపోతున్న తెలంగాణపై స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

తెలంగాణ ప్రజలు నీళ్లకోసం కళ్లల్లో నీళ్లు తిరిగేలా ఆశగా చూస్తున్నారు. మరో నెల రోజులు ఇలానే కొనసాగితే తమ భవిష్యత్ ఎంటని ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు నీటిమట్టాలు పడిపోవడంతో ఇప్పటికే వేసిన పంటలతో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు ఉన్నాయని వార్తల్లో వినిపిస్తున్నా, మబ్బుల చాటుకు దాక్కుని చుక్క నీరు కిందకు పడడం లేదు. తీవ్ర వర్షపాత లోటు, అడుగంటుతున్న జలాశయాలు వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలతో తెలంగాణ సమాజం మరోసారి జల సంక్షోభం అంచున నిలిచింది. ఒకవైపు క్యాలెండర్‌లో వానాకాలం సీజన్ సగం ముగిసిపోతున్నా, ఆకాశం వైపు చూస్తున్న రైతాంగానికి నిరాశే మిగులుతోంది. గ్లోబల్ ఎల్‌ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మొహం చాటేయడం, 30 శాతం వర్షాల లోటు ఏర్పడడం జరిగాయి.

డెడ్ స్టోరేజీకి చేరిన ప్రాజెక్టులు

కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉన్న ప్రధాన, మధ్య తరహా, చిన్న నీటిపారుదల జలాశయాలన్నీ ప్రస్తుతం వాటి కనీస నీటిమట్టానికి చేరుకున్నాయి. శ్రీరాంసాగర్ ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాజెక్టులో ప్రస్తుతం నీరు కేవలం 3 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉంది. కేవలం తాగునీటి అవసరాలకే నెలకు అర టీఎంసీ అవసరం.

మిషన్ భగీరథకు ముప్పు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు తాగునీరు అందించే 123 శుద్ధి కేంద్రాలు, 29 ప్రధాన జలాశయాలపైనే ఆధారపడి ఉన్నాయి. రిజర్వాయర్లలో నీరు నిలిచిపోతే, రాబోయే రోజుల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. సాగునీటికి కోత పెట్టి, రిజర్వాయర్లలోని నీళ్లు తాగునీటి అవసరాలకు రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌లో ప్రమాద ఘంటికలు

కేంద్ర భూగర్భ జల బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ తాజా నివేదికల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలోని 18 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్, పరిసర పట్టణ ప్రాంతాల్లో నీటి మట్టాలు వేగంగా అడుగంటాయి. గతేడాది జూన్‌లో భూగర్భ జలాల సగటు లోతు 9.96 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 12.43 మీటర్లకు పడిపోయింది. అంటే కేవలం ఏడాదిలోనే 2.47 మీటర్ల మేర నీరు కిందకు వెళ్లిపోయింది. భూపాలపల్లి (12.26 మీటర్లు), ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల (1.51 మీటర్ల పతనం), పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో బోర్లన్నీ ఎండిపోతున్నాయి. గతంలో 5 మీటర్ల లోతులోనే లభించిన నీరు, ఇప్పుడు వందల అడుగులు లోతుకు వెళ్తే గానీ దొరకని పరిస్థితి నెలకొంది.

మూడు దశల ప్రభుత్వ అగ్రీ ప్లాన్

వర్షాలు లేకపోవడం, నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను కటాఫ్ పీరియడ్స్‌గా పెట్టుకుని త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేసింది. రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగు విస్తీర్ణాన్ని పెంచవద్దు, తక్కువ నీటితో, స్వల్ప కాలంలో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించింది. ఇప్పటికే వరి నార్లు పోయని రైతులను ఆరుతడి పంటలైన జొన్నలు, కొర్రలు, కందులు, పెసర్లు, మొక్కజొన్న వైపు మళ్లించేందుకు ప్రభుత్వం 16.30 లక్షల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తనాలను సిద్ధం చేసింది. ఇప్పటికే వరి నాట్లు వేసిన రైతులు నీటిని ఆదా చేసేందుకు "ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (తడి పొడి) పద్ధతిని, "డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్" పద్ధతిని పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

కాగితాలపైనే ప్రణాళికలు.. క్షేత్రస్థాయిలో సవాళ్లు

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా విత్తనాల కొరత భయం వెంటాడుతోంది. ఆగస్టు 15 వరకు వర్షాలు రాకపోతే, అంత పెద్ద మొత్తంలో ప్రత్యామ్నాయ విత్తనాలు చిన్న సన్నకారు రైతులకు సకాలంలో అందుతాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. వరిని నమ్ముకున్న రైతు ఇప్పుడు అకస్మాత్తుగా ఆరుతడి పంటలకు మారాలంటే పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది. బోర్ల రీ డ్రిల్లింగ్ కోసం రైతులు మరింత అప్పులపాలవుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలైన చిరుధాన్యాలు, పప్పుధాన్యాలకు ప్రభుత్వం నుండి సరైన కొనుగోలు మద్దతు లభిస్తుందా అనేది అనుమానం. అర్ధిక సంక్షోభమే కాకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మండలాల వారీగా వీక్లీ బులెటిన్లు విడుదల చేస్తూ, మైక్రో ఇరిగేషన్ (బిందు సేద్యం) వైపు రైతులను నడిపించకపోతే ఈ ఏడాది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు (టీఎంసీలలో)

గోదావరి బేసిన్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ప్రస్తుత నీటి నిల్వ తాజా పరిస్థితి

శ్రీరాంసాగర్ 90.31 TMC 3.0 TMC డెడ్ స్టోరేజీ

లోయర్ మానేరు డ్యామ్ 24.07 TMC 7.2 TMC సాగునీటి విడుదల అవకాశం లేదు

సింగూరు 29.91 TMC 11.5 TMC హైదరాబాద్, సంగారెడ్డి తాగునీటి అవసరాల కోసం

నిజాంసాగర్ 17.80 TMC 5.7 TMC డెడ్ స్టోరేజీ

మల్లన్న సాగర్ 50.00 TMC 10.1 TMC సామర్థ్యంలో ఐదో వంతు మాత్రమే నీరు

కృష్ణా బేసిన్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ప్రస్తుత నీటి నిల్వ తాజా పరిస్థితి

నాగార్జున సాగర్ 312.05 TMC 145 - 150 TMC తగ్గుతున్న నీటిమట్టం.. తాగునీటికి గండం

శ్రీశైలం 215.81 TMC 45 - 50 TMC విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం

ప్రియదర్శిని జూరాల 9.66 TMC 4.2 TMC కర్ణాటక నుండి లేని ఇన్‌ఫ్లో

#ts-water-crisis#telangana-drought#agricultural-distress#reservoir-levels#alternative-crops#groundwater-depletion
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి