శివుని తల్చుకోగానే తల మీద చంద్రవంకతో, మెడలో ఫణిహారంతో కూడిన రూపం కళ్లముందు కదులుతుంది.. ఇంతకీ ఈ పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? అని ఎప్పుడైనా ఆలోచించారా?.. అయితే ప్రచారంలో ఉన్న కథ ప్రకారం.. పండితులు చెబుతున్నది ఏమిటంటే.. చంద్రడు, అనసూయాదేవి సుతుడు. అత్రి పుత్రుడు.. దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహాశక్తిసంపన్నుడు.
అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సుని శాసించే వాడిగా జ్యోతిషంలో స్థానాన్ని కూడా పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు.
అయితే వివాహానికి ముందు దక్షుడు, చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకీ సమానమైన ప్రేమని అందిచాలని.. ఆ మాటకు మారు మాటాడకుండా సరేనన్నాడు చంద్రుడు. ఆరోజు నుండి రోజుకో భార్య వద్ద ఉండసాగాడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచేకొద్దీ చంద్రునికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలుగసాగిందట.
ఈ విషయం తెలిసిన దక్షుడు, చంద్రుని మందలించాడు. కానీ ఎన్నిరోజులు గడిచిన చంద్రునిలో అదే తీరు కనిపించగా.. ఈసారి దక్షుడు ఊరుకోలేదు. చంద్రుని మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగుని చూసుకుని నువ్విలా విర్రవీగుతున్నావో, ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆయన శపించినట్లుగానే రోజు గడిచేకొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే కనుక క్షీణించి పోతే ఔషధుల పరిస్థితి ఏంకాను? మనుషుల మనస్సులు ఏం కాను? అంటూ కలవరపడి పోసాగారు దేవతలు. చంద్రుడు కూడా తనకు శాపవిమోచనం ప్రసాదించమంటూ ఎందరిని వెదుకున్నా.. అతనికి ఎక్కడా ఉపశమనం లభించలేదు. చివరికి కొంత వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు.
చంద్రుని పరిస్థితిని గమనించిన భోళా శంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం సాధారణమైనది కాదు.. కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు! అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు. కాబట్టి మధ్యేమార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు. దక్షుని శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదనీ, అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగుని సంతరించుకుంటాడనీ తెలియచేశాడని చెబుతారు..
పరమేశ్వరుని వద్ద ఉంటే దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించిన చంద్రుడు, అప్పటి నుంచి శివుని సిగలో ఉండిపోయాడట. మోహం ఎంతటివారినైనా దిగజారుస్తుందనీ, తప్పు తెలుసుకొని పరమేశ్వరుని పాదాలని చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయం అవుతుందనీ.... ఈ వృత్తాంతం తెలియచేస్తోంది.












