తెలంగాణ జెన్‌కో (TG Genco) పరిధిలో నిరసనలు, ఆందోళనలపై యాజమాన్యం ఉక్కుపాదం మోపింది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయవద్దంటూ, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో జెన్‌కో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జెన్‌కో ప్రధాన కార్యాలయమైన విద్యుత్ సౌధ ప్రాంగణంలో ఎలాంటి నిరసనలు, ర్యాలీలు చేపట్టకూడదని స్పష్టం చేస్తూ తక్షణమే నిషేధాజ్ఞలు విధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) లోని యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు సంబంధించిన ప్రైవేట్ టెండర్లను రద్దు చేయాలంటూ విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిత్యం విద్యుత్ సౌధ వేదికగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనల వల్ల కార్యాలయ రోజువారీ విధులకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని యాజమాన్యం భావించింది.
ఈ నేపథ్యంలో జెన్‌కో హెచ్‌ఆర్ డైరెక్టర్ ఎస్.వి. కుమార్ రాజు రంగంలోకి దిగి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విద్యుత్ సౌధ ఆవరణలో ఉద్యోగులు ఎలాంటి సమావేశాలు నిర్వహించడం, గుంపులుగా చేరి ర్యాలీలు తీయడం, బ్యానర్లు పట్టుకుని నిరసనలు తెలపడం వంటి కార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విధులకు హాజరయ్యే ఉద్యోగులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
యాజమాన్యం జారీ చేసిన ఈ తాజా నిబంధనలను, ఆదేశాలను ఎవరైనా ఉద్యోగులు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జెన్‌కో డైరెక్టర్ గట్టిగా హెచ్చరించారు. నిషేధాన్ని ధిక్కరించి నిరసనల్లో పాల్గొనే వారిపై క్రమశిక్షణా ఉల్లంఘన కింద కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలే తప్ప, విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించడంతో విద్యుత్ సౌధలో ప్రస్తుతం ఉత్కంఠ వాతావరణం నెలకొంది.












