దేశంలో అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన రిలయన్స్ తాజాగా 2026-27 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన క్యూ1లో కంపెనీ రూ.20,946 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే గత ఏడాది వచ్చిన రూ.26,994 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ..
ఈ తగ్గుదలకు ప్రధాన కారణం గతేడాది తొలి త్రైమాసింలో ఏషియన్ పెయింట్స్‌లో రిలయన్స్ తన వాటాలు (రూ.8,924 కోట్లు) విక్రయించడం వల్ల వన్‌టైమ్ గెయిన్ కింద లాభంలో భారీ వృద్ధి నమోదైంది. దాన్ని మినహాయిస్తే ఓ2సీ, రిటైల్, డిజిటల్ వ్యాపారాలు రాణించడంతో మెరుగైన ఫలితాలను అందుకుని 25 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే సమయంలో రూ.2.48 లక్షల కోట్లుగా ఉన్న ఆదాయం రూ.3.11 లక్షల కోట్లకు పెరిగినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
మరోవైపు రిలయన్స్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ ఆకట్టుకునే ఫలితాలను నమోదు చేసింది. క్యూ1లో జియో రూ.7,764 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. అలాగే ఆదాయం 12 శాతం పెరిగి రూ.39,173 కోట్లకు చేరుకుంది. అలాగే జియో సేవలపై వినియోగదారుల ఆదరణ కూడా మరింత పెరిగింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం అంటే ఏఆర్‌పీయూ రూ.215.6కు చేరుకుంది.
అదే సమయంలో ప్రతి వినియోగదారుడు నెలకు సగటున 43.7 జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా అత్యంత కీలకంగా, ఈ త్రైమాసికంలో జియోకు కొత్తగా 89 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు చేరడం విశేషం. మొత్తంగా చూస్తే, వన్‌టైమ్ గెయిన్ ప్రభావంతో లాభాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ, రిలయన్స్ ప్రధాన వ్యాపార విభాగాలు, ముఖ్యంగా జియో, రిటైల్, ఓ2సీ రంగాలు భారీగా లాభాలు ఆర్జించాయని తెలుస్తుంది.












