Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలతో న్యూస్ లో నిలుస్తున్నారు. ఏదో ఒక అంశంలో ఏదో ఒక దేశంపై ట్రంప్ విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా డ్రాగన్ కంట్రీ చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చైనా ఉలిక్కిపడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కుట్ర పన్నిందని ట్రంప్ ఆరోపించారు. ఇంటెలిజెన్స్ ప్రకారం 2020లో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక 22 కోట్ల మంది అమెరికా ఓటర్ల వివరాలను చైనా తస్కరించిందన్నారు ట్రంప్. తమ ఓటర్ల జాబితా విదేశీ ప్రభుత్వాల చేతుల్లో ఉందన్నారు. యూఎస్ ఎన్నికల ప్రక్రియకు చైనా వల్ల ప్రమాదం ఉందన్నారు ట్రంప్. అమెరికాలో లక్షల మంది ఓటర్లు అక్రమంగా రిజిస్టర్ అయ్యారని ట్రంప్ అన్నారు. చైనాతో పాటు రష్యా, ఇరాన్, నార్త్ కొరియా వంటి దేశాలు అమెరికా ఎన్నికల్లో జోక్యానికి ప్రయత్నిస్తున్నాయని ట్రంప్ ధ్వజమెత్తారు.
''2020 ఎన్నికల సమయంలో అమెరికా ఓటర్ల డేటా లక్ష్యంగా చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీ జరిగింది. ఈ ఘటనతో అమెరికా ఎన్నికల భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడింది. ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను డీప్ స్టేట్ కు చెందిన కొందరు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు'' అని ట్రంప్ అన్నారు.
చైనాను టార్గెట్ చేస్తూ ట్రంప్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ట్రంప్ ఆరోపణలు కలకలం రేపాయి. ఈ అంశంపై డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ట్రంప్ ఆరోపణలను చైనా ఖండించింది. అమెరికా ఎన్నికలు పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారం అని తేల్చి చెప్పిన చైనా..
అందులో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న విధానాన్నే చైనా ఎల్లప్పుడూ అనుసరిస్తుందని క్లారిటీ ఇచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా గతంలోనూ జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి చర్యలకు పాల్పడదని వ్యాఖ్యానించింది. అసలు తమకు అలాంటి అవసరం కూడా లేదని చైనా వెల్లడించింది.












