తెలంగాణ

Mahabubabad: గురుకుల పాఠశాలలో త్రాగు నీటి కష్టాలు.. భగ్గుమన్న విద్యార్థులు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

పేద, గిరిజన బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కానీ ఇప్పుడు ఆ గురుకులాలే సమస్యలకు నిలయంగా మారాయనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.

నేటి బాలలే రేపటి పౌరులు అంటారు.. అలాంటి వారికి ఉన్నతమైన, నాణ్యమైన విద్యను అందిస్తే వారి భవిష్యత్తుతో పాటు.. రాష్ట్ర భవిష్యత్తు కూడా మారిపోతుందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా పేద, గిరిజన బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించింది.

కానీ ఇప్పుడు ఆ గురుకులాలే సమస్యలకు నిలయంగా మారాయనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా.. కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయంటూ విద్యార్థినులు గురువారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రారంభమై నెల రోజులు గడిచినా స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదని, సరిపడా బాత్రూంలు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం నిద్రలేవగానే వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా నీళ్లు ఉండటం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారిందని వారు వాపోయారు. బాత్రూంలు వినియోగానికి అనుకూలంగా లేకపోవడంతో బయటకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ పాముల సంచారం ఉండటంతో భయాందోళనలకు గురవుతున్నామని విద్యార్థినులు తెలిపారు.

తాము ఎదుర్కొంటున్న సమస్యలను పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థినులు ఆరోపించారు. టాయిలెట్ల మరమ్మతుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 చొప్పున వసూలు చేసినప్పటికీ పనులు జరగలేదని పేర్కొన్న విద్యార్థినులు.. ఈ సమస్యల గురించి బయటకు చెబితే అంతర్గత మార్కులు తగ్గిస్తామని హెచ్చరించారంటూ పేర్కొన్నారు.

మరోవైపు విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇదే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క విద్యార్థినులతో ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై విచారణ జరిపిస్తామని, వాస్తవాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే తాగునీరు సహా అత్యవసర సమస్యలను 12 గంటల్లో పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తామని తెలిపారు. ఇక ప్రజా ప్రభుత్వం గురుకులాల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి?.. అనే ప్రశ్నలు జనంలో పుడుతున్నాయి.

ఈ ఒక్క చోటనే కాకుండా పలు చోట్ల ఉన్న గురుకులాల్లో సైతం ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతుండటం చూస్తుంటే విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ఇంకా కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. నిధులు పక్కదారి పట్టకుండా చూడవలసిన బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాయి..

#telangana#Mahabubabad#Kothaguda#Gandhinagar#Tribal Girls#Welfare Residential School#Drinking water
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి