టాప్ న్యూస్

EGG PRICE: కోడిగుడ్డు ఆల్ టైమ్ రికార్డు.. ధర పెరుగుదలకు కారణాలు ఇవే!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

"గుడ్డు.. గుడ్డు.. ఎందుకంత రేటు పెరిగావు అంటే.. 'ఎండలు ముదిరిపోయాయి, నా పౌల్ట్రీలు ఖాళీ అయిపోయాయి, దాణా ధరలు కొండెక్కి కూర్చున్నాయి' అన్నదట!" ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరల తిప్పలు సరిగ్గా ఇలాగే ఉన్నాయి.

 "గుడ్డు.. గుడ్డు.. ఎందుకంత రేటు పెరిగావు అంటే.. 'ఎండలు ముదిరిపోయాయి, నా పౌల్ట్రీలు ఖాళీ అయిపోయాయి, దాణా ధరలు కొండెక్కి కూర్చున్నాయి' అన్నదట!" ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరల తిప్పలు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. వేసవి దెబ్బకు గుడ్డు ధర క్రమంగా పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వానాకాలం వచ్చినా ఎండలు తగ్గుముఖం పట్టక ‘ఎల్‌నినో’ ప్రభావం కాస్త గుడ్డుపైనా పడుతోంది.

 తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హోల్‌సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.7.10 గా నమోదైంది. దీంతో ఒక ట్రే (30 గుడ్లు) హోల్‌సేల్ ధర రూ. 213 కి చేరింది. ఈ ప్రభావం బహిరంగ మార్కెట్‌పై తీవ్రంగా పడటంతో, కిరాణా షాపులు, రిటైల్ మార్కెట్లలో ఒక్కో గుడ్డును రూ. 8.00 నుండి రూ. 8.50 పైనే విక్రయిస్తున్నారు.

 అటు ఆంధ్రప్రదేశలో కోడిగుడ్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రమైన తూర్పుగోదావరి జిల్లాలో గుడ్డు ధరలు మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పౌల్ట్రీ ఫామ్‌ల వద్దే ఒక్కో గుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ.6.95 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి ఇది రూ. 8.50 దాటింది. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, చౌకైన పోషకాహారంగా భావించే గుడ్డు ధరలు ఇలా చుక్కలు చూపించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

 గతేడాది ఇదే సమయానికి ఫామ్‌గేట్ వద్ద రూ. 4.94 గా ఉన్న ధర, ప్రస్తుతం దాదాపు రెండు రూపాయల మేర పెరగడం గమనార్హం. ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఈ ఏడాది నమోదైన తీవ్రమైన ఎండలేనని తెలుస్తోంది. జిల్లాలోని పౌల్ట్రీలలో సాధారణంగా 1.3 కోట్ల కోళ్లు ఉంటూ, రోజుకు కోటి వరకు గుడ్ల ఉత్పత్తి జరిగేది. అయితే వేసవి వడగాల్పుల ధాటికి తట్టుకోలేక అధికారికంగా 16.35 లక్షలు, అనధికారికంగా దాదాపు 20 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి.

 ప్రాణాలతో ఉన్న కోళ్లు సైతం వేడి వాతావరణం కారణంగా గుడ్ల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేశాయి. దీనివల్ల మార్కెట్‌లో గుడ్ల కొరత తీవ్రమై ధరలు విపరీతంగా పెరిగాయి. గుడ్డు ధరలతో పాటు ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్ ధర కూడా రూ. 300 మార్కును దాటడంతో మాంసాహార ప్రియులకు ఏం కొనాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, పౌల్ట్రీ నిర్వహణ వ్యయం కూడా ఊహించని విధంగా పెరిగిపోవడంతో ఉత్పత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 కోళ్ల దాణాకు ఉపయోగించే ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయి. టన్ను సోయా ధర రూ.40 వేల నుంచి రూ.65 వేలకు చేరగా, నూనె తీసిన తవుడు ధర రూ.12 వేల నుంచి రూ.22 వేలకు ఎగబాకింది. వీటితో పాటు మొక్కజొన్న ధరలు కూడా పెరగడంతో పెట్టుబడి భారం భరించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పెరిగిన వ్యయంతో రైతులు, ఇటు కొండెక్కిన ధరలతో వినియోగదారులు ఇరుపక్షాలూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

#EggPriceHike#PoultryCrisis#CostOfLiving#SummerHeatImpact#FeedPriceRise#CommonManBurden
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి