భాగ్యనగర సంస్కృతీ సంప్రదాయాలకు సమున్నత ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల జాతర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. లంగర్ హౌస్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

శ్రీ గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, ప్రభుత్వ పక్షాన అధికారికంగా పట్టువస్త్రాలను, మొదటి 'బంగారు బోనాన్ని' సమర్పించి రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా మంత్రి కొండా సురేఖకు, మంత్రి పొన్నం ప్రభాకర్ బోనం ఎత్తి అందించారు.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ జాతర ప్రారంభోత్సవంలో భాగంగా ఆలయ ఆవరణతో పాటు లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ భక్తి పారవశ్యంతో ఊగిపోయాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల వీర విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో గోల్కొండ కోట పరిసరాలు మార్మోగాయి. లక్ష్మీదేవి స్వరూపమైన అమ్మవారికి సమర్పించే ఈ బోనాల పండుగ విశిష్టతను కళ్లారా చూసి తరించేందుకు నగరంలోని నలుమూలల నుండి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పేలా కళాకారుల ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.చారిత్రాత్మక నేపథ్యం ఉన్న గోల్కొండ ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు, ఆలయ ప్రగతి పనుల కోసం ప్రభుత్వం తరఫున రూ. 11 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంత్రులు చెక్కు రూపంలో ఆలయ కమిటీ నిర్వాహకులకు అధికారికంగా అందజేశారు.

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు గోల్కొండ కోట తొలి వేదిక కావడంతో, ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎండ తీవ్రత, రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూలైన్లు వంటి ప్రాథమిక వసతులను సిద్ధం చేశారు. నగరవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.












