తెలంగాణ

TG: నేనే కాబోయే సీఎం.. కాదు నేనే.. అప్పుడే కాంగ్రెస్‌‌లో లొల్లి!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

TG: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తి కాలం కూడా గడవకముందే, గాంధీ భవన్‌లో సీఎం కుర్చీ చుట్టూ అంతర్గత లొల్లి తారాస్థాయికి చేరింది. పాలనను పరుగులు పెట్టించాల్సిన కీలక సమయంలో, ప్రజా సమస్యల పరిష్కారం కంటే వచ్చే 2029 ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారనే చర్చే కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య జోరుగా నడుస్తుండటం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది.

TG: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తి కాలం కూడా గడవకముందే, గాంధీ భవన్‌లో సీఎం కుర్చీ చుట్టూ అంతర్గత లొల్లి తారాస్థాయికి చేరింది. పాలనను పరుగులు పెట్టించాల్సిన కీలక సమయంలో, ప్రజా సమస్యల పరిష్కారం కంటే వచ్చే 2029 ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారనే చర్చే కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య జోరుగా నడుస్తుండటం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. రేవంత్ రెడ్డే సీఎం పీఠం ఎక్కగాలేనిది, పార్టీని ఎన్నో ఏళ్లుగా మోస్తున్న మేమెందుకు కాకూడదన్న అంతర్గత ఈగో ఇప్పుడు బహిరంగ ప్రకటనల రూపంలో బయటపడుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇటీవల కాలంలో ఒకరి తర్వాత ఒకరుగా కాంగ్రెస్ కీలక నేతలంతా తామే కాబోయే సీఎంలమంటూ ఓపెన్‌గా క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇప్పటికే తమ మనసులోని కోరికను బయటపెట్టగా, ఎమ్మెల్సీ జగ్గారెడ్డి, యువ నేత బల్మూరి వెంకట్‌, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సైతం సీఎం రేసులో తామూ ఉన్నామంటూ ఎవరికి వారు కర్చీఫ్‌లు వేసుకుంటున్నారు. వీరందరినీ మించి స్వయంగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ కూడా తానే కాబోయే సీఎం అన్న ధోరణిలో కామెంట్స్ చేయడం సొంత పార్టీ కేడర్‌కే మింగుడుపడటం లేదు. సమన్వయం చేయాల్సిన పీసీసీ చీఫే ఈ రేసులో దూకడంతో గాంధీ భవన్‌లో గ్రూపు రాజకీయాలు మరింత ముదిరి పాకాన పడ్డాయని అంటున్నారు.

మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు కాకపోవడంతో అప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతుండగా, అనుకున్న రీతిలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు అసంతృప్తితో రోడ్లపైకి వస్తున్నారు. వీటికితోడు పలువురు కాంగ్రెస్ మంత్రులపై వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తడం ప్రభుత్వ ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది. అసలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా లేదా అన్న స్పష్టత లేని పరిస్థితుల్లో, ప్రజా సమస్యలను గాలికొదిలేసి నేతలంతా కుర్చీ కోసం పిల్లిమొగ్గలు వేయడం పార్టీని నిండా ముంచేలా కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నా కూడా నేతల మధ్య సమన్వయం లేకుండా ఇలా బహిరంగంగా కత్తులు నూరుకుంటుంటే, ఇక 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఇంకెన్ని ముక్కలవుతుందో చూడాలంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో సెటైర్లు పేలుతున్నాయి.

#Telangana#Telangana News#TG News#Telangana Politics#Telangana Political News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి