తెలంగాణ

Elnino: ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది- భట్టి విక్రమార్క

రచన: NK••11 నిమిషాల పఠనం

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలను తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

‎* ‎కరువుపై ముందస్తు కార్యాచరణ.. కేంద్రానికి నివేదిక పంపించాము‎

* ‎అవసరమైతే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి సాయం సాధిస్తాం‎

* ‎ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమష్టి కార్యాచరణ‎

* ‎అఖిలపక్ష నేతల సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తాం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‎

* ‎కరువు నివారణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో అఖిలపక్ష సమావేశం‎

* ‎తాగు, సాగు నీరు, విద్యుత్ సరఫరాపై అఖిలపక్ష నేతల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ‎

*‎ అఖిలపక్ష సమావేశానికి హాజరైన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, తుమ్మల, శ్రీహరి

Elnino: ‎ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలను తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించామని, అవసరమైన సమయంలో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన సహాయంపై విజ్ఞప్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకొని సమష్టి కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు.‎

ఎల్ నినోను ఎదుర్కొనేందుకు చర్యలు

‎ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి ‎భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నోడల్ అధికారి రామక్రిష్ణరావు హాజరయ్యారు. ‎

ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరపున అంజన్ కుమార్ యాదవ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరపున వినోద్ కుమార్, రమణ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీజేపీ తరపున శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ప్రొఫెసర్ సింహాద్రి, వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నాయకురాలు శోభా యాదవ్, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు శ్రీరామ్ కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హేమ సుదర్శన్, తెలుగుదేశం పార్టీ తరఫున కాట్రగడ్డ ప్రసన్నకుమార్ తదితరులు హాజరయ్యారు. కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, రైతులకు అండగా నిలిచే చర్యలు, తాగునీరు-సాగునీటి సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.‎

రాజకీయ విమర్శలు వద్దు.. ప్రజా ప్రయోజనాలే లక్ష్యం

విపత్తు పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని భట్టి విక్రమార్క కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి సమావేశం నిర్వహించామని తెలిపారు. నేతలు ప్రస్తావించిన అంశాలను నమోదు చేసుకున్నామని, సాధ్యమైన మేరకు వాటిని ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఎల్‌నినో ప్రభావంపై గతంలోనూ శాసనసభలో చర్చించామని, వివిధ సమావేశాలు, సదస్సులు నిర్వహించడంతోపాటు శాస్త్రవేత్తలు, నిపుణులతో సంప్రదింపులు జరిపామని వివరించారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రానున్న నెలల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైన సన్నద్ధతతో ఉన్నామని పేర్కొన్నారు. ‎

నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు

‎వర్షపాతం లోటు ఒక్క తెలంగాణకే పరిమితమైతే పొరుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షపాతం లోటు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రత్యామ్నాయ ప్రాంతాల నుంచి నీటి లభ్యత తగ్గిన పరిస్థితుల్లో జల వనరుల నిర్వహణ మరింత కీలకంగా మారిందని వివరించారు. ‎రిజర్వాయర్లలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు

వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు శాఖలవారీగా సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామని, పశువులకు తాగునీరు, మేత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అఖిలపక్ష నేతలు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.‎‎

పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష నేతలు చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించామని వివరించారు. ‎గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, పశువులకు అవసరమైన నీటి వసతులు కల్పించేందుకు అవసరమైన బడ్జెట్, ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సమావేశంలో వచ్చిన సూచనలను పరిశీలించి, అమలుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

కేంద్రం సాయం కోరుతాం

కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో అన్ని చర్యలు చేపడుతూనే, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపించామని, అవసరమైన సహాయం అందేలా ప్రతిపాదనలు సమర్పిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయం పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కోరుతామని భట్టి విక్రమార్క చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలి

గతంలో కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొన్న సమయంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పని చేశాయని ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించి రాష్ట్రాన్ని కరువు ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో రాజకీయాలకు తావులేకుండా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని విలువైన సలహాలు, సూచనలు అందించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు భట్టి విక్రమార్క.

#Elnino#Telangana#Telangana Govt#All Party Meeting#Bhatti Vikramarka#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి