* ప్రకృతి విపత్తును అధిగమించేందుకు సానుకూల, నిర్మాణాత్మక వైఖరి
* తెలంగాణ రాష్ట్రం, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
* మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Elnino: కరువు పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూల, నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష సమావేశంలో నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, ఎల్‌నినో నోడల్ అధికారి రామకృష్ణారావు హాజరయ్యారు.
అఖిలపక్ష నాయకుల సలహాలు, సూచనలు స్వీకరణ
ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులు, వాటి వల్ల ప్రజలు, రైతులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటికి విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, కరువు నివారణకు ముందస్తు చర్యలు వంటి కీలక అంశాలపై అఖిలపక్ష నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రభుత్వం వినిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించే సమయంలో వారి అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నిర్మాణాత్మక దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. “నదీ జలాల అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.


