తెలంగాణ

TG: ఖమ్మం, భద్రాద్రికి అర్నబ్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి మంత్రి పొంగులేటి!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న ‘అర్నబ్’ తుపాను ప్రభావం ఇప్పుడు తెలంగాణ వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సరిహద్దు ప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

TG: బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న ‘అర్నబ్’ తుపాను ప్రభావం ఇప్పుడు తెలంగాణ వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సరిహద్దు ప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కుండపోత వర్షాలతో పాటు భీకరమైన ఈదురుగాలులు విరుచుకుపడే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద తీవ్రతను ముందుగానే పసిగట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.

కలెక్టర్లతో మంత్రి అత్యవసర మీటింగ్..

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో మంత్రి పొంగులేటి నేరుగా ఫోన్‌లో మాట్లాడి గ్రౌండ్ లెవల్ పరిస్థితులపై సమీక్షించారు. తుపాను తీవ్రరూపం దాల్చకముందే ప్రజల రక్షణకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు క్షణక్షణం క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న వరద గండం

భద్రాద్రి, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తే ముప్పు ఉండటంతో లోతట్టు గ్రామాలు, నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా నిమిషాల వ్యవధిలో సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీగా ఉండాలని ఆదేశించారు. అధికారులు ముందస్తు ప్లాన్‌తో సిద్ధంగా ఉంటేనే పెను విపత్తు నుంచి జనాన్ని కాపాడగలమని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని యంత్రాంగం హెచ్చరించింది.

#Telangana#Telangana News#TG News#Telangana Weather#Telangana Weather Alert#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి