Musi: రాష్ట్రంలో తీవ్ర కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటే.. ప్రజలు తాగునీరు, సాగునీరు లేక అల్లాడిపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వేల కోట్ల రూపాయలతో 'మూసీ సుందరీకరణ' పేరుతో మరో మెగా దోపిడీకి తెరలేపిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
కనీసం డీపీఆర్ లేకుండా, ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలను గాలికొదిలేసి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ద్వారా రూ. 7,345 కోట్ల అప్పు తెచ్చి గ్లోబల్ టెండర్లు పిలవడం పాలకుల దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. మూసీ రివైవ్‌మెంట్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసపూరిత వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు దాసోజు శ్రవణ్. మూసీ టెండర్ల ముసుగులో.. రూ.7,300 కోట్ల పనుల్లో.. 30 శాతం కమీషన్ కోసమే రేవంత్ రెడ్డి ఆరాటం అని ధ్వజమెత్తారు.
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్ట కాల్చుకోడానికి నిప్పు కావాలని ఇంకొకడొచ్చాడట!
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి, పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటు కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని దయనీయ స్థితిలో ప్రజలు ఉన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో కరువు నివారణ చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి... 'మూసీకి రంగులు వేస్తా, గోడలు కడతా' అంటూ రూ. 7 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చి లూటీ చేయడానికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గం.
మూసీ పబ్లిక్ హియరింగ్ కాదు ప్రైవేట్ హియరింగ్
చట్టబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన పబ్లిక్ హియరింగ్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా 'ప్రైవేట్ హియరింగ్'గా మార్చేసింది. ఎల్బీ నగర్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక శాసనసభ్యుడు, మాజీ చైర్మన్ సుధీర్ రెడ్డిని, బాధితులను పబ్లిక్ హియరింగ్‌లోకి రాకుండా అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనం. ప్రతిపక్షాలు నిలదీస్తాయనే భయంతో పోలీసులను అడ్డంపెట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య ఖూనీయే.
రూ.20వేల కోట్ల ప్రాజెక్ట్.. లక్షన్నర కోట్లకు ఎలా పెరిగింది?
గతంలో సుధీర్ రెడ్డి నేతృత్వంలో మూసీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సమగ్రమైన ప్రణాళికలు రూపొందించగా, నేడు సింగపూర్ కంపెనీల కనుసన్నల్లో ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని అమాంతం లక్షన్నర కోట్లకు పెంచేశారు. అమరావతి గ్రాఫిక్స్ మోడల్‌ను తలపించేలా అదానీ, మేఘా లాంటి సంస్థలకు కట్టబెట్టి వేల కోట్ల కమీషన్లు దండుకోవడమే ఈ ప్రాజెక్ట్ అసలు ఉద్దేశం.
డీపీఆర్ లేకుండా భూసేకరణా? ఇది ప్రజా సంపదను దోచుకోవడమే
కనీసం డీపీఆర్ (Detailed Project Report), సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ లేకుండా టెండర్లు పిలవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. 20 టీఎంసీల నీటిని మల్లన్నసాగర్ నుంచి తెచ్చి మూసీలో పోస్తామంటున్నారే తప్ప, వచ్చే పది నెలల్లో ప్రజలకు అవసరమైన 100 టీఎంసీల తాగునీటి మాటేంటో చెప్పరు. హైకోర్టు భవనాలు, జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (IIMR), వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను సైతం వదలకుండా కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నారు.
కమీషన్ల కక్కుర్తి - పేదలపై కత్తి
ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు, రైతు భరోసా అందక రైతులు, ఆసరా పింఛన్లు రాక వృద్ధులు అల్లాడుతుంటే... పాలకుల కడుపు నిండడానికి మాత్రం మూసీ ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల దందాలు సాగుతున్నాయి. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, ఇది ముమ్మాటికీ 'మూసీ లూటిఫికేషన్'.
డీపీర్ లేకుండా, పేదల ఇళ్లను కూల్చేసే కుట్రలను, అడ్డగోలు దోపిడీలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కమీషన్ల కోసం పాకులాడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారు అని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.


